జనసేన పార్టీతో పొత్తు ఉండాలని తెలుగుదేశం పార్టీ బలంగా కోరుకుంటోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర్నుంచి … ఎంపీ టీజీ వెంకటేష్ వరకూ.. అందరూ అదే చెబుతున్నారు. కలిస్తే తప్పేమిటన్న ప్రశ్న దగ్గర్నుంచి కలసి రావాలనే విజ్ఞప్తులు దాటి.. ఇప్పుడు.. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరపబోతున్నామని.. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించడం వరకూ.. వ్యవహారం వచ్చింది. కానీ జనసేన వైపు నుంచి స్పందన ఏది.. ?
ప్రెస్‌నోట్‌తో కాదు ఖండఖండాలుగా ఎందుకు ఖండించరు..?
కొద్ది రోజుల కిందట… టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన.. టీడీపీతో కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అప్పుడు .. మీడియాలో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. విజయవాడలోనే ఉన్న పవన్ కల్యాణ్.. రెండు రోజుల పాటు స్పందించలేదు. దాంతో.. అందరూ.. టీడీపీ బాటలోనే పవన్ కల్యాణ్ ఉన్నారని తీర్మానించుకున్నారు. ఓ అభిప్రాయం బలపడుతున్న సమయంలో… జనసేన తీరిగ్గా ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. దాని సారాంశం ఏమిటంటే… అధికార, ప్రతిపక్ష పార్టీలతో పొత్తుల్లేవని… పెట్టుకుంటే కమ్యూనిస్టులతోనే అనేది.. ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన ఎంత మొక్కుబడిగా ఉందంటే.. రాజకీయాల్లో పార్టీ మారేవారు.. చర్చలు పూర్తికాక ముందే సమాచారం బయటకు వస్తే..ఎలా ఖండిస్తారో.. అలానే ఉంది. ఆ ప్రెస్‌నోట్.. అనుమానాల్ని మరింత పెంచిందే కానీ తగ్గించలేదు.
చంద్రబాబుపై పవన్‌కు అంత సానుభూతి ఎందుకు..?
అదే సమయంలో పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీ అధినేతకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. కేసీఆర్, జగన్ భేటీ అవుతున్నారని తెలిసిన తర్వాత పూర్తిగా.. టీడీపీని డిఫెడ్ చేస్తూ ప్రకటనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. తెనాలిలో పర్యటించిన పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్తో వైసీపీ కలవడంపై విమర్శలు చేశారు. వారిద్దర్నీ కలిపింది చంద్రబాబుపై ద్వేషమేనన్నారు. చంద్రబాబుగారిపై కక్షతోనే వారిద్దరూ కలిశారని.. అంతకు ముందు జగన్‌ను.. ఆయన తండ్రిని.. టీఆర్ఎస్ ఎలా విమర్శించిందో అందరి్కీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతోనే.. గతంలో పొత్తులు ఉండవన్న.. ప్రెస్‌నోట్‌కు.. విలువ లేకుండా పోయింది. అదే అదనుగా..టీడీపీ నేతలు… జనసేనతో పొత్తుపై అధికారిక ప్రకటనలు చేయడం ప్రారంభించారు. వరుసగా.. జనసేనకు ఆహ్వానం పలుకుతున్నారు. అది ఇప్పుడు సీట్ల సర్దుబాటు చర్చల వరకూ వచ్చింది.
పొత్తులపై టీజ్ చేస్తున్నా జనసేనానికి సిగ్గెందుకు..?
ఈ ప్రకటలన్నింటినిపై…. జనసేన ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు. సహజంగా.. జనసేనలో పవన్ కల్యాణ్ చెప్పేదే అల్టిమేట్. నాదెండ్ల చెప్పినా.. మరో రావెల చెప్పినా.. అదో పెద్ద విషయంకాదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం… తన పార్టీ.. టీడీపీతో అసోసియేట్ అయిపోతోందని.. బయట గగ్గోలు రేగుతున్నా… తనంతట తాను స్వయంగా నేరుగా.. ఎలాంటి ఖండనలు విడుదల చేయడం లేదు. ప్రెస్ నోట్ కన్నా… నేరుగా ఓ మాట చెబితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. కానీ చెప్పడం లేదు. గతంలో.. తెలుగుదేశం పార్టీపై… చేసే విమర్శలు చాలా తీవ్రంగా ఉండేవి. చంద్రబాబు, లోకేష్‌పై చేసే అవినీతి ఆరోపణలు కలకలం రేపేవి. ఇతర టీడీపీ నేతలపై ఆయన వ్యక్తం చేసే ఆగ్రహం హైలెట్ అయ్యేది. కానీ ఇటీవలి కాలంలో అదేమీ లేదు. పైగా.. టీడీపీపై సానూభూతితో మాట్లాడుతున్నారు. ఏమైనా విమర్శలు వస్తే.. అవి జగన్ పైనే ఉంటున్నాయి.
ఇంత కాలం చేసిన తిరుగుబాటు తుస్సేనా..?
పవన్ కల్యాణ్ మళ్లీ టీడీపీతో కలవడానికే.. అయితే.. ఇప్పటి వరకూ చేసిన రాజకీయం వృధానే. ఏదో ఓ కారణం చెప్పి.. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమైతే పవన్ కల్యాణ్‌ను అందరూ మామూలు రాజకీయ నాయకుల్లానే చూస్తారు. ఆయన చెప్పుకున్నట్లుగా కొత్త తరం రాజకీయ నేతగా చూడరు. ఒక వేళ టీడీపీతో పొత్తుకు సిద్ధం కాకపోతే.. తెలుగుదేశం పార్టీ నేతల ప్రకటనలను తీవ్రంగా ఖండించాలి. అది ఎలా ఉండాలంటే.. తను పోరాటయాత్రల్లో చంద్రబాబు లోకేష్‌లపై చేసినంత తీవ్రమైన విమర్శలు ఉండాలి. అలా చేయకపోతే.. పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమైనట్లే.. టీడీపీ నేతలు చెప్పినట్లు సీట్ల సర్దుబాటు చర్చలు చేస్తున్నట్లే..!.
———సుభాష్