అప్పటి వరకూ టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు. ఇక కాసేపట్లో జగన్ మాట్లాడతారనగా.. బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరడం.. వెంటనే సస్పెండ్ చేయడం జరిగిపోయింది. వారిని బయటకు పంపేశారు. ఆ తర్వాత సీఎం జగన్ పాలనా వికేంద్రీకరణపై మాట్లాడటం ప్రారంభించారు. టీడీపీ సభ్యులు ఉన్నప్పుడు సభ సజావుగానే సాగింది. వైసీపీ సభ్యులు తాము చేయాలనుకున్నా.. చెప్పాలనుకున్న విమర్శలు.. ఆరోపణలు చేశారు. టీడీపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. కానీ జగన్ మాట్లాడేటప్పుడు ఇలా కౌంటర్లు ఇస్తారేమోననుకున్నారేమో కానీ టీడీపీ సభ్యుల్ని బయటకు పంపేశారు.
పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజధాని ప్రకటన రాక ముందే సభలో ఉన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్.. తాను భూములు కొన్నది రాజధాని ప్రకటన తర్వాతేనన్నారు. తన విషయంలో తప్పు ఉంటే బినామీ చట్టం ఉపయోగించి భూములు స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేదని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో వేసిన కేసుల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. పయ్యావుల విమర్శలపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ప్రకటన రాక ముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని… అక్కడ భూములన్నీ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. పాదయాత్ర చేస్తున్న వాళ్లెవరుూ రైతులు కాదని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ చేసే ఆరోపణలే చేసినా ..టీడీపీ సభ్యులు కేవలం నినాదాలే చేస్తున్నా.. సస్పెండ్ చేసేశారు.