తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆవిడ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. మదర్ సెంటిమెంట్ ను పండించారు.
ప్రసంగం మొదలు పెడుతూనే, చాలా రోజుల తర్వాత బిడ్డను చూసిన తల్లికి ఎలాంటి ఎమోషన్ అయితే కలుగుతుందో తనకు అలాంటి ఎమోషనే ఇప్పుడు కలుగుతోందని సోనియాగాంధీ చెప్పింది. బిడ్డ జీవితం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుందని, అయితే ఈ నాలుగున్నరేళ్ల లో తెలంగాణలో అలా జరగలేదని, చిన్న బిడ్డ కు సరైన పోషకాలు ఇవ్వకపోతే ఆ బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉండదని, అలాగే ఇప్పుడు తెలంగాణ కి కూడా కెసిఆర్ పాలనలో అన్యాయం జరుగుతోందని దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని సోనియాగాంధీ వ్యాఖ్యానించింది.
ఏది ఏమైనా, సోనియాగాంధీ మదర్ సెంటిమెంట్ బాగానే పండినప్పటికీ ప్రజలలో కొన్ని సందేహాలు మాత్రం మిగిలి పోయాయి. చాలా కాలం తర్వాత బిడ్డలను చూసిన తల్లికి కలిగే అనుభూతి తనకు ఇప్పుడు కలిగిందని చెప్పిన సోనియాగాంధీ, 2014 ఎన్నికలలో ఓటమి అనంతరం ఆ బిడ్డల వైపు కనీసం తొంగి కూడా ఎందుకు చూడలేదని జనాలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు తమను గెలిపించలేదనే భావనతోనే తెలంగాణను సందర్శించ లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడనే కాదు , అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడి ఆర్నెల్లపాటు జనాలంతా రోడ్ల మీదకు వచ్చి ప్రతిరోజు ఉద్యమాలు చేసినా కూడా కనీసం అటువైపు తొంగి చూడడానికి కూడా ఆవిడకు సమయం సరిపోలేదు. ఇటు తెలంగాణ సమస్యల గురించి కానీ అటు ఆంధ్ర సమస్యల గురించి కానీ పార్లమెంటులో ఏ రోజూ, ఆవిడ గత నాలుగేళ్లలో మాట్లాడింది లేదు. కేవలం ఎన్నికల ముందు వచ్చి, ఒక సభ పెట్టి భావోద్వేగాలను పండిస్తే సరిపోతుందని ఢిల్లీ నాయకుల అభిప్రాయం కాబోలు. మరో ఆరు నెలల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు వస్తాయి. బహుశా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కూడా వచ్చి ఇలాగే సెంటిమెంట్ పండించవచ్చు.
మరి తెలుగు ప్రజలు ఈ సెంటిమెంట్ ను ఎలా ఆదరిస్తారన్నది రెండు వారాల్లో తెలిసిపోతుంది.
– జురాన్