తెలంగాణ పోలీసులపై తెలుగుదేశం పార్టీ గుంటూరులో పెట్టిన దొంగతనం కేసులో బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అసలు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మార్చి 2వ తేదీ అర్థరాత్రి ఫిర్యాదు ఇచ్చారు. దాని ప్రకారమే సోదాలు చేశాం. ఉద్యోగుల్ని ప్రశ్నించాం.. అని.., సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. కానీ.. సైబరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఆ సీసీ కెమెరాల దృశ్యాలు ఉన్నాయి. సమాచారం డౌన్ లోడ్ చేసి తీసుకెళ్లారని… దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా టీడీపీ పోలీసులకు అందించింది.
అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం.. మార్చి రెండో తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకే.. కేసులు నమోదు చేశామని.. చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన సోదాలు చేశామని అంగీకరించలేదు. ఇదే.. తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారింది. కోర్టులో కూడా.. బలమైన సాక్ష్యంగా ఉంటుంది. ఒక వేళ … తాము సోదాలు చేశామని అంగీకరిస్తే.. ఎవరి ఫిర్యాదు మేరకు చేశారు..? కారణం ఏమిటి..? ఫిర్యాదు చేసి… ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే సోదాలు చేయాలనే చట్టం తెలియదా..? డాటా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది..? లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇక.. సోదాలు చేయలేదని వాదిస్తే.. ఐటీ గ్రిడ్ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో దొరికిన పోలీసులు బుక్కయిపోతారు. ఆ తర్వాత కేసు… కమిషనర్ వరకూ వస్తుంది. ఆ పోలీసులు తాము దొంగతనానికి వెళ్లామని అంగీకరించలేరు కదా..! అలా అంగీకరించినా.. అది డిపార్ట్మెంట్ మెడకు చుట్టుకుంటుంది.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా కేసు డైరీలో ఖాళీపత్రాలపై సంతకాలు తీసుకున్న వైనం, సీఆర్పీసీ 161 కింద ఫిర్యాదుదారు లోకేశ్వర్‌రెడ్డి స్టేట్మెంట్ తీసుకోకుండానే దర్యాప్తు ప్రారంభించడం, కేసు నమోదు చేయకముందే సెర్చి వారెంట్ లేకుండానే కార్యాలయంలో తనిఖీలు చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం వంటివన్నీ సంబంధిత దర్యాప్తు అధికారిపై, అందుకు ప్రోత్సహించిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించేవేనని న్యాయ నిపునులు చెబుతున్నారు. ప్రస్తుతానికి టీడీపీ నమోదు చేసిన కేసు… తుళ్లూరు పోలీసులకు బదిలీ చేశారు. ముందుగా.. ఇరవై మూడో తేదీన ఐటీ గ్రిడ్‌లో తనిఖీ చేసిన పోలీసులకు… నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.