తెలంగాణలో మెగా డీఎస్సీని వేశాం… పరీక్షలు కూడా వాయిదా వేయకుండా పెట్టేశాం… ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి తీరుతాం అంటూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పదే పదే చెప్తున్న మాటే. కానీ చెప్పే మాటలకు, డీఎస్సీ జరుగుతున్న తీరుకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.
ఆన్ లైన్ లో పరీక్షలు పెడితే సులువుగా రిజల్ట్ ఇవ్వొచ్చు. ఆగస్టు 5వ తేదీతో పరీక్షలు అయిపోయాయి. ప్రాథమిక కీ, ఫైనల్ కీ ఇవ్వటానికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ఫైనల్ కీ ఇవ్వటానికి నెల రోజుల సమయం తీసుకున్నారు. పోనీ ఫైనల్ కీ తో పాటు జనరల్ వెయిటింగ్ లిస్ట్ అంటే జీఆర్ఎల్ ఇచ్చారా అదీ లేదు. దానికి ఎంత సమయం పడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. విద్యాశాఖ చెప్పదు.
ఇంతలో ఫైనల్ కీలో తప్పులు అంటూ కొందరు ఎప్పట్లాగే కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన తమకు ఎందుకింత నిరీక్షణ అనేది నిరుద్యోగుల వాదన. ఈ ఉద్యోగం వస్తుందో రాదో తేలిపోతే ఇంకో పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారుంటారు. ముఖ్యంగా కొందరు ఆడపిల్లలు పెళ్లిళ్లు వాయిదా వేసుకొని మరీ ప్రిపేర్ అయ్యారు. వారికి ఓ క్లారిటీ రావాలి. వీటన్నింటికి తోడు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలా వద్దా అనుకునే వారితో పాటు వచ్చే డిసెంబర్ లో మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు కాబట్టి దానికి ప్రిపరేషన్ లేదా కోచింగ్ స్టార్ట్ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస చాలా మందిలో ఉంది.
కానీ, ఇవేవి విద్యాశాఖకు పట్టడం లేదు. ఫైనల్ కీ తో పాటు జీఆర్ఎల్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఇవ్వలేదు. సరే కొన్ని రోజుల గడువుతో అయినా ఇవ్వొచ్చు. కానీ ఆ పరిస్థితులు కూడా కనపడటం లేదు. జీఆర్ఎల్ ఇచ్చేదెప్పుడు? 1:3 సెలక్షన్ లిస్ట్ పెట్టేదెప్పుడు…? 11వేలకు పైగా పోస్టులు అంటే 33వేలకు పైగా నిరుద్యోగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేదెప్పుడు? చివరకు ఉద్యోగ నియామక పత్రాలతో పాటు జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేదెప్పుడు? అన్న చర్చ సాగుతోంది.
కొందరైతే… ప్రభుత్వం ఇప్పట్లో ఇచ్చే ఉద్దేశంతో లేనట్లు కనపడుతోంది. డిసెంబర్ 9న తెలంగాణ ఆవిర్భావ ప్రకటనతో పాటు సోనియాగాంధీ పుట్టిన రోజు కాబట్టి అప్పటి వరకు ప్రక్రియను ఆలస్యం చేసినా చేయవచ్చు అంటూ పరీక్షలు రాసిన యువత కామెంట్ చేస్తున్నారు. సీఎం దగ్గర ఉన్న శాఖలోనే ఇంత ఆలస్యం అయితే ఎలా అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాశాఖ ఏం చేస్తుందో… క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.