తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం డీఎస్పీ పరీక్ష పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తు వస్తున్న డీఎస్సీ, ఎన్నో అవరోధాలు దాటి పరీక్షను పూర్తి చేసుకుంది.
11,062 పోస్టులకు ఆన్ లైన్ లో పరీక్షలు పూర్తయ్యాయి. మరోవైపు స్కూల్స్ లో ఇప్పటికే ప్రమోషన్లు, బదిలీలు కూడా పూర్తయ్యాయి. దీంతో చాలా పాఠశాలల్లో ఖాళీలు అధికంగానే ఉన్న నేపథ్యంలో… కొత్త టీచర్లు వస్తేనే చదవులు సజావుగా సాగే అవకాశం ఉంది. డీఎస్పీ పరీక్ష కూడా పూర్తి కావటం, అది కూడా ఆన్ లైన్ పరీక్షనే కావటంతో… నెల రోజుల వ్యవధిలోనే కొత్త టీచర్లు వస్తారని అంతా భావించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ సలహాదారు వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని, సెప్టెంబర్ 5 వరకు కొత్త టీచర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది.
కానీ, ఆగస్టు 5వ తేదీతో డీఎస్సీ పరీక్షలు కూడా ముగిశాయి. కానీ ఇంత వరకు రెస్పాన్స్ షీట్స్, ప్రాథమిక కీ ఏవీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించలేదు. కార్యాచరణ కూడా తెలియకపోవటంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు.
దీనికి తోడు కొన్ని జిల్లాల్లో విద్యావాలంటీర్లను నియమించుకోవటానికి ప్రభుత్వం అనుమతివ్వటం మరింత గందరగోళానికి తావిస్తోంది. వికారాబాద్ తో పాటు మరో జిల్లాలో కూడా తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఉపాధ్యాయుల రాక ఆలస్యం అవుతుందా? పరీక్ష కూడా పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించి… పోస్టింగ్స్ ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? ఆన్ లైన్ పరీక్షే అయినా ఇంత ఆలస్యం ఎందుకు? అంటూ అభ్యర్థుల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.