తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ఒక ముఖ్యమంత్రి, మరో మంత్రితోనే నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభా వ్యవహారాల బాధ్యతలను.. ముఖ్యమంత్రి కేసీఆరే నిర్వహిస్తున్నారు. మొదటగా పద్దెనిమిదో తేదీనే మంత్రివర్గ విస్తరణ ఉంటుదని.. దానికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని… ముఖ్యమంత్రి కేసీఆర్… జీఏడి అధికారులను ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. కానీ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించేందుకు గవర్నర్ ను ఆహ్వానించేందుకు వెళ్లిన కేసీఆర్… మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తామన్నారు కానీ.. ఎప్పుడన్న విషయం చెప్పలేదు. పద్దెనిమిదో తేదీ విస్తరణ ఉంటే.. ఈ పాటికే రాజ్ భవన్ వర్గాలకు సమాచారం అందేది. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో.. విస్తరణ లేదని తేలిపోయింది. బడ్దెట్ సమావేశాలు మార్చిలో పెట్టాలనుకుంటున్నట్లుగా… కేసీఆర్ .. గవర్నర్ కు చెప్పారు.
అంటే… అప్పట్లోపు మంత్రివర్గ విస్తరణ చేయడానికి సమయం తీసుకుంటున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం పీడ దినాలు నడుస్తున్నాయని.. ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని మధ్యలో టీఆర్ఎస్ అగ్రనేతలు తోసిపుచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేలోపే పదవుల పంపకం ఉంటుందని.. కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. స్పీకర్ ఎన్నికతో పాటు… అసంతృప్తులు చెలరేగకుండా… విస్తరణ కూడా చేస్తారని అనుకున్నారు. కానీ.. టీఆర్ఎస్ లో ఇప్పుడు పదవి వచ్చినా రాకపోయినా.. నోరు ఎత్తే పరిస్థితి లేదు. కేసీఆర్ పదవి ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది కాబట్టి…. కేసీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే.
మంత్రివర్గ విస్తరణకు ఏం అడ్డం పడుతుందో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కావడం లేదు. కేసీఆర్.. ఎలాంటి సానుకూల వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. మరో వైపు ఆలస్యం అయ్యే కొద్దీ.. వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వడం లేదన్న ప్రచారం ఓ వైపు.. అత్యంత విధేయులకే.. పట్టం కడతారన్న ప్రచారం మరో వైప సాగుతోంది అదే సమయంలో కేటీఆర్ కు అత్య్ంత సన్నిహితులకే అవకాశం అని చెబతున్నారు. ఈ ప్రచారాల నడుమ… టీఆర్ఎస్ సీనియర్లు.. మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న వాళ్లు.. టెన్షన్ కు గురవుతున్నారు.