భారతీయ జనతా పార్టీ అతి కష్టం మీద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఒప్పించి పార్టీ కండువా కప్పారు. ఆయన మాస్ లీడర్ కాదు. కానీ ఆయనకు గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు బీజేపీలో పెద్దగా ఉపయోగపడుతుందని ఎవరూ అనుకోరు. ఆయన తప్ప ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు లేరు. చేరుతామన్న వారు కూడా వెనక్కి తగ్గుతున్నారు. గతంలోబండి సంజయ్ పాదయాత్రలో సునామీలా చేరికలు ఉంటాయని ప్రకటించారు. మాట్లాడుకున్న వారు కూడా చేరలేదు. అందరూ వెనక్కి తగ్గారు. ఇప్పుడు తర్వాత ఎవరు చేరుతారన్నదానిపై స్పష్టత లేదు. పార్టీలో చేరికలు చాలా డల్‌గా ఉన్నాయి.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. పదవికి గండం వస్తుందని తెలిసినా ఓ నగర పాలక సంస్థ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటే చిన్న విషయం కాదు. తన భార్య జడ్పీ చైర్మన్ అయినా సరే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోనే చేరారు. రాబోయే రోజుల్లో చాలా మంది ప్రముఖ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎవరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న లీక్ రావడం లేదు.
బీజేపీకి మీడియాలో హైప్ కనిపిస్తోంది కానీ జనం లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి లీడర్ ఉండటం ప్లస్ పాయింట్ అని.. ఆయన పార్టీని గట్టెక్కిస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీలో అలాంటి నాయకత్వం కరవైంది. పైగా బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఇమడటం సాధ్యం కాదు. అక్కడ అంతా పార్టీ నేతలు రింగ్ అయిపోయి ఉంటారు.. ఇతరులకుచాన్స్ రానివ్వరు. అందుకే హైకమాండ్ ఈటలకు చేరికల బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆయనకే నిన్నామొన్నటిదాకా ప్రాధాన్యం లేదని.. ఇప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలరనేది ప్రశ్న.