తెలంగాణ ముందస్తు ఎన్నికలను నిర్వహించిన సీఈవో, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ లాంటి అత్యంత కీలక శాఖను చూస్తున్న సీనియర్ ఐఏఎస్ తన కూతురి పెళ్లి ఖర్చులు మొత్తాన్ని మేఘా కంపెనీతో పెట్టించడం సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది. దిన్యూస్ మినిట్ అనే వెబ్ సైట్ మొత్తం వివరాలతో సహా ఇచ్చింది. తమ కథనానికి పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. కానీ ఒక్కరంటే ఒక్కరూ కిక్కురుమనడం లేదు. ముఖ్యంగా మీడియా కూడా అప్రకటిత సైలెన్స్ పాటిస్తోంది. దీనికి కారణం ఆ మేఘా కంపెనీనేనని చెప్పుకోవచ్చు.
మేఘా కంపెనీ పెద్ద ఎత్తున రజత్ కుమార్ కూతురి పెళ్లికి ఖర్చులు పెట్టుకుంది. ఇప్పుడు మీడియా ఆకంపెనీ చేతుల్లో ఉంది. ప్రధాన ఎలక్ట్రానిక్ టీవీ చానళ్లు టెన్ టీవీ, టీవీ9, ఎన్టీవీ వంటి వాటిలో భాగస్వామ్యమో.. భాగస్వామ్యులతో వ్యాపార ఒప్పందాలో ఉన్నాయి. ఇక ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఇలాంటి కథనాలు వస్తే కథలు..కథలుగా వడ్డిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. మేఘా కంపెనీ ఎక్కడ యాడ్స్ ఆపేస్తుందోననే భయం. మామూలుగా అయితే ఇలాంటి కథనాలను ఈనాడు ప్రచురించడం ఎప్పుడో మానేసింది.
మీడియా చెప్పడం లేదు.. కానీ ప్రజలకు తెలియకుండా ఉంటుందా..?. మెజార్టీ ప్రజలకు తెలియడం లేదు కానీ రజత్ కుమార్ అవినీతి మాత్రం రికార్డులకు ఎక్కింది.ఎవరూ తుడిచేయలేని విధంగా ఆయన ఇరుక్కుపోయారు. దీనిపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కానీ మేఘా కంపెనీకి ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధం దృష్ట్యా అలాంటి విచారణలు జరిగే అవకాశం లేదు. అనూహ్యంగా బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇది మేఘా కు ఉన్న పలుకుబడికి సాక్ష్యంగా భావిస్తున్నారు.