ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజున కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి..ఆ రిపోర్టును మీడియాకు ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కాగ్ బయట పెట్టే అంశాలు ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. ఎందుకంటే కాగ్ బయట పెట్టేది లోపాలు కాబట్టి. ఆర్థిక నిర్వహణ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం నిర్వాకాలేంటో కాగ్ బయట పెడుతుందని.. ఆ రిపోర్టు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
కానీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కానీ కాగ్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా కానీ.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టినట్లుగా కానీ ఎక్కడా సమాచారం బయటకు రాలేదు. అసెంబ్లీ అజెండాలో కాగ్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పిస్తుంది అని ఉంది. కానీ అలాంటిదేమీ జరిగినట్లుగా లేదు. ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులు ఎన్ని చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. విజయవాడలోని బెరం పార్క్ వంటి వాటిని కూడా తాకట్టు పెట్టారు. అలాంటి అప్పులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోంది.
అదే సమయంలో మద్యం ఆదాయాన్ని వివిధ రకాలుగా తాకట్టు పెట్టడం.. ఖజానాకు రాకుండానే తరలించడం వంటివి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీటన్నింటిపై కాగ్ ఎలా స్పందిస్తున్నదానిపై ఆర్థిక నిపుణుల్లోనూ ఆసక్తి ఏర్పడుతోంది. కానీ రిపోర్టు మాత్రం బయటకు రాలేదు. కాగ్ ఇవ్వలేదా..లేక ప్రభుత్వం బయట పెట్టలేదా అన్నదానిపై స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు.