ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీకే హాజరు కాని గంటా శ్రీనివాసరావు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని పట్టుబడుతున్నారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. గంటా శ్రీనివాస్ మరోసారి స్పీకర్ కు లేఖ రాశారు. గతంలో తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇచ్చానని దాన్ని ఆమోదించాలని అందులో కోరారు.
స్టీల్ ప్లాంట్ నుప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం తీసుకున్నప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. అయితే మొదట ఆయన రాసిన లేఖ ఫార్మాట్లో లేదన్న విమర్శలు రావడంతో ..తర్వతా ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇచ్చారు. తర్వాత గంటా శ్రీనివాసరావు ఓ సారి ఆముదాల వలస వెళ్లి స్పీకర్‌తో సమావేశమయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే ఇంత వరకూ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగుతోంది. ఒక వేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయి. అదే జరిగితే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ కారణంగానే రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. రాజీనామా ఆమోదించకపోయినా .. గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు.