ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కో రైతుకు హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. పధ్నాలుగు మంది పధ్నాలుగు లక్షలు కట్టాలి. ఓ వైపు కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారు ఇప్పుడు మరోసారి బాధితులుగా మిగిలారు. వారు చేసింది తప్పే. శిక్షించారు. మరి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ప్రతీ రోజూ తప్పు దోవ పట్టిస్తోంది. ఓ రకంగా ఆడుకుంటోంది. మరి అలాంటి ప్రభుత్వానికి ఇంకెంత శిక్ష వేయాలి.
కోర్టు తీర్పులు పాటించడం లేదు. అందుకే వేల కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ కేసులో చూసినా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. చివరికి రుషికొండ విషయంలో కోర్టును ప్రభుత్వం ఎన్ని సార్లు తప్పుదోవ పట్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ పట్టిస్తూనే ఉంది. అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం బిందాస్‌గా ఉంది. ఫలానా కేసులో ప్రభుత్వం నిజాయితీగా వివరాలు ఇచ్చిందని చెప్పడానికి లేదు. అన్నీ అవాస్తవాలనే కోర్టుకు చెప్పిన విషయం అనేక సార్లు బయటపడింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఎన్నో దురాగతాలకు పాల్పడింది. వాటితో పోలిస్తే ఇప్పటం రైతులు చేసింది అవగాహనా లోపమే.
అప్పటిప్పుడుకూల్చివేతలు ఆపాలన్న లక్ష్యంతో నోటీసులు అందలేదని చెప్పి ఉండవచ్చు. కానీ హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా కూల్చివేతలు కొనసాగాయి. కూల్చాలనుకున్నంత కూల్చేశారు. ఆ హైకోర్టు ఉత్తర్వుల వల్ల ఆగిందేమీ లేదు. కానీ.. వారికి అదనంగా రూ. లక్ష జరిమానా. ప్రభుత్వాలు అరాచకాలకు పాల్పడతాయి. అధికారం ఉందని చెలరేగిపోతాయి. ప్రజలతో సంబంధం లేదని.. అధికారం అనుభవించి.. తాము చేయాలనుకున్నదే చేస్తామనుకునే పాలకులు ఉన్నప్పుడు వారి నుంచి ప్రజల్ని రక్షించాల్సింది న్యాయస్థానాలే. కానీ అవే ప్రజల్ని జరిమానాలతో భయపెడితే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ?