బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిందేమీ లేదు. ఎన్నికలు ఉన్నందున తెలంగాణకు అయినా నిధులు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. బడ్జెట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే కొన్ని కేటాయించారు. సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ – 300 కోట్లు కేటాయించారు. ఇక అన్ని ఎయిమ్స్ ఆస్పత్రులకు కలిపి కేటాయించిన వాటిలో కొన్ని నిధులు మామూలుగానే తెలంగాణ,ఏపీ ఎయిమ్స్ లకు వస్తాయి. కానీ ప్రత్యేక కేటాయింపులు మాత్రం అస్సలు లేవు. కేంద్ర పన్నుల్లో వాటా కూడా చాలా తక్కువే తెలంగాణకు వస్తుంది. తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక ఏపీ గురించి అయితే అసలు పట్టించుకోలేదు. అయితే కేంద్ర పన్నుల్లో వాటా మాత్రం ఏపీకి తెలంగాణ కంటే రెట్టింపు లభించింది. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లుగా తేల్చారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి- రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి – రూ.168 కోట్లు, అమ్మకానికి పెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు – రూ.683 కోట్లు కేటాయించారు. అంతే కానీ మరి ఏ ఇతర విభాగాలకూ నిధులు కేటాయించలేదు. విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన.. పోలవరం ప్రస్తావన రాలేదు. అసలు దేనికీ కేటాయింపులు లేనే లేవు.
అయితే ఎన్నికలు ఉన్న కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లను కేటాయించారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని అందించేందుకు అ కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. జాతీయ ప్రాజెక్టు అయిన ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు పైసా కూడా కేటాయించలేదు. అలాగే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చాలా కాలంగా కోరుతున్నా కేంద్రం పైసా కూడా కేటాయించలేదు.
గత ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాతకేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల పాటు విమర్శలు గుప్పించారు. ఈ సారి స్పందించలేదు. కవిత మాత్రమే స్పందించారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన భలే బడ్జెట్ అని ప్రశంసించారు. ఢిల్లీలో ఎంపీలు మాత్రం ఇదేం బడ్జెట్ అని పెదవి విరిచారు. నాలుగేళ్లుగా వాళ్లు అదే చేస్తున్నారు. వారి మాటల్ని కూడా పట్టించుకోవడం మానేసారు. ఇక ఏపీకి ఎంత అన్యాయం జరిగినా మనకుకాదు గా అన్నట్లుగా ఉండే సీఎం జగన్ కూడా ఏమీ స్పందించలేదు.