రాష్ట్రం విడిపోతే తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోతుందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తర్వాత జరిగింది ఓ చరిత్ర. ఏపీలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయి కానీ తెలంగాణలో మాత్రం రావడం లేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతోంది. నేడు.. రేపు అని వాయిదా వేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి అందుతోంది. ఎక్కడా సంక్షోభంలో ఉన్న దాఖలాల్లేవు. ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లుగా కరెంట్‌ను పొదుపుగా వాడుకోవాలని చెప్పడం లేదు.
తెలంగాణలో కరెంట్ అవసరాలు చాలా ఎక్కువ. అక్కడ వ్యవసాయంలో అత్యధికం బోర్ల కిందనే ఉంటుంది. అదే సమయంలో పారిశ్రామికంగానూ అభివృద్ధి సాధించింది. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. కానీ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. ఈ కారణంగా విద్యుత్‌ను జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల ప్రాతిపదికన విభజన చట్టంలో పంచారు. తరవాత తెలంగాణ తీసుకుంటున్న కరెంట్‌కు డబ్బులివ్వలేదని ఆపేశారు. అయితే తెలంగాణ పట్టించుకోలేదు. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంది. వ్యూహాత్మకంగా విద్యుత్ రంగంలో నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఇప్పుడు తెలంగాణకు కరెంట్ కోరత అనే ప్రశ్న వినిపించడం లేదు.
దేశంలో విద్యుత్ కొరతకు ప్రధానంగా బొగ్గు కొరత కారణంగా ఉంది. తెలంగాణలోనే సింగరేణి ఉంది. సింగరేణి ఉత్పత్తికి వచ్చిన కొరతేమీ లేదు. కానీ విద్యుత్ సంస్థలు డబ్బులు చెల్లించడం లేదు. రూ. ఐదు వేల కోట్ల వరకూ వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏపీ కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ బొగ్గు అవసరం లేదన్నట్లుగా ఏపీ ప్రభుత్వం, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వ్యవహరించి బయట కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. అప్పట్లో తక్కువకే బయట దొరికిన విద్యుత్ ఇప్పుడు ఎంత పెట్టి కొన్నా దొరకని పరిస్థితి. బొగ్గు కొనకుండా ఉత్పత్తి నిలిపివేయడంతో ఇప్పుడు మరింత సమస్య పెరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాత్కాలిక లాభాలు చూసుకోకుండా … దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందడుగు వేసింది.కానీ ఏపీ ప్రభుత్వం పీపీఏలు రద్దు చేసుకుని.. వాటితో లడాయి పెట్టుకుని విద్యుత్ కొనకుండా.. సొంత ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి చేయకుండా బయట కొనడానికే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం కూడా అంధకారంలోకి వెళ్లిపోతోంది.