ఇప్పుడు దేశంలో ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉందనే దానిపై లెక్కలు గట్టి పద్దులు తయారీ చేసే పని మొదలయింది. దానికి ప్రామాణికంగా ‘భారత్ మాతా కి జై, వందేమాతరం’ అనే పదాలను తీసుకొని లెక్కలు కడుతున్నారు. కాశ్మీర్ వేర్పాటువాదులతో అంటకాగుతున్నా భారత్ మాతా కి జై! అన్నవాళ్లు దేశభక్తుల క్రిందే లెక్క. మత పరమయిన అభ్యంతరాల వలననో లేక వామపక్ష భావజాలం ప్రభావం చేతనో ఆ పదాలు పలకడానికి ఇష్టపడని వాళ్ళు అందరూ దేశద్రోహుల క్రిందే లెక్క! అటువంటివాళ్ళు తాము కూడా దేశ భక్తులమేనని నిరూపించుకొనేందుకు ‘జై హింద్’ వంటి ప్రత్యామ్నాయ నినాదాలను చేస్తున్నట్లుగా తమ ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేసుకోవలసివస్తోంది. ఈర్ష్యాద్వేషాలు, ఐహిక సుఖాలకు అతీతుడిగా మెలగవలసిన బాబా రామ్ దేవ్ వేలకోట్ల టర్నోవర్ గల వ్యాపారాలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నా అదేమీ నేరం కాదు కనుక ఎవరూ ప్రశ్నించలేరు. కానీ భారత్ మాతాకి జై అని నినదించని వాళ్ళ తలలు నరికేసేవాళ్ళమేనని కానీ చట్టానికి గౌరవించి ఆగిపోయామని ఆయన గర్వంగా చెప్పుకోవడమే అందరికీ పెద్ద షాక్. భారత్ మాతా కి జై అని అనడానికి ఇష్టపడని వాళ్ళు దేశం విడిచి ఏ పాకిస్తాన్ కో వెళ్లిపొమ్మని అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఇప్పుడేమీ స్వాతంత్ర సంగ్రామం జరగడం లేదు. కనీసం వేరే దేశంతో యుద్ధం చేయడం లేదు. అప్పుడప్పుడు విదేశాలతో మనోళ్ళు క్రికెట్ ఆడుకొన్నప్పుడు స్టేడియంలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో కులమత ప్రాంతాలకు అతీతంగా దేశప్రజలందరిలో దేశభక్తి ఏరులై పారుతుండటం కళ్ళకు కట్టినట్లే కనిపిస్తుంటుంది. అయినా కూడా హటాత్తుగా ఈ దేశభక్తి లెక్కలు, కొలతలు ఎందుకు మొదలయ్యాయి? అంటే దానికి మూలకారణం దేశభక్తి కాదు…కాంగ్రెస్ పార్టీ, భాజపాల మధ్య నెలకొన్న రాజకీయ వైరమేనని చెప్పవలసి ఉంటుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి దేశంలో ‘మత అసహనం’ పెరిగిపోతోంది, భావ స్వేచ్చకి భంగం కలుగుతోందని గట్టిగా చేసిన ప్రచారం వలన బిహార్ లో భాజపా ఘోరపరాజయం పాలయింది. మళ్ళీ ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. బహుశః ఈసారి వాటిలో మళ్ళీ ఇటువంటి ‘ఇబ్బంది’ని ఎదురకూడదనే ఉద్దేశ్యంతోనే మత ఆసహనానికి కౌంటర్ గా భాజపా ఈ దేశభక్తి వివాదాన్ని భుజనికెత్తుకొన్నట్లు కనిపిస్తోంది. ఒకానొక సమయంలో అయోధ్యలో రామాలయం వివాదంతో భాజపా ఏవిధంగా లబ్ది పొందొందో ఇప్పుడు ఈ ‘దేశభక్తి’ లెక్కలతో కూడా లబ్ది పొందాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుంది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇటువంటిదేదో ఒక అంశంతో ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడటం దేశంలో కొత్తేమీ కాదు. కనుక ఇది కూడా అటువంటి ప్రయత్నమేనని భావించవచ్చును.
అయితే తీరా ఇంత శ్రమపడినా భాజపా ఈ ఎన్నికలలో గెలిచే అవకాశాలున్నాయా…అంటే అనుమానమే. తాజాగా వెలువడిన సర్వేలన్నీ కూడా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మరియు పుదుచ్చేరిలో భాజపా కనీసం గౌరవప్రదమయిన సీట్లు కూడా గెలుచుకొనే అవకాశాలు లేవని తేల్చి చెపుతున్నాయి. మిగిలిన ఒక్క రాష్ట్రం అసోంలో మాత్రం చాన్సస్ 50-50 అని చెపుతున్నాయి. మరి ఈ మాత్రం దానికి ఈ లెక్కలు, పద్దులు ఎందుకో? దాని వలన భాజపాకి ఎటువంటి లాభం ఉండదు కానీ దేశ ప్రజల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.
గ్రహించవచ్చును.