హైదరాబాద్: సినిమాలలోనూ, రాజకీయాలలోనూ అతనికున్న పాపులారిటీకి, బ్రాండ్ ఇమేజ్‌కీ కోట్లకు కోట్లు సంపాదించుకోవచ్చు. వరసగా సినిమాలు ఒప్పుకుని చేసేయొచ్చు. యాడ్స్ చేయొచ్చు. కానీ చేయడు. కాబట్టే అతను పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇలా వందలకోట్ల బ్రాండ్ ఇమేజ్ను వృథా చేసుకుంటున్న సెలబ్రిటీ మరొకరు ఉండరేమోననిపిస్తుంది. అందుకే అంటారు అతనికి కాస్త తిక్కుందని.
ఏ సమస్య అయినా కానీయండి. రాజకీయ నేతలు మొదలుపెడతారు…. పవన్ స్పందించాలని, పవన్ బయటకు రావాలని. అది ఓటుకు నోటు కేసు అయినా కానీయండి, ఏపీ రాజధానికి భూ సేకరణ అయినా కానీయండి, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు అయినా కానీయండి. వివిధ పార్టీల నేతలు – సమస్యలగురించి మాట్లాడేటపుడు పవన్ తమతో కలిసి పోరాడాలంటారు. మిత్రపక్షాలు బీజేపీ, తెలుగుదేశాన్ని పక్కన పెట్టండి, సీపీఐ, సీపీఎమ్, లోక్సత్తాలాంటి చిన్నపార్టీల దగ్గరనుంచి వైసీపీలాంటి పెద్ద పార్టీవరకు(వైసీపీ నేత కొడాలి నాని ఇటీవల భూసేకరణపై నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ, చంద్రబాబు నిర్ణయం మార్చుకోబోతే జనసేనతో కలిసి నిలదీస్తామని అన్నారు) ఇదే వరస. సాక్షాత్తూ ఏపీ ప్రభుత్వం భూసేకరణపై పవన్ డిమాండ్‌కు తలఒగ్గి జీవోను ఉపసంహరించుకోవటం పవన్ పాపులారిటీకి పరాకాష్ఠ.
ఇక సినిమాల విషయానికొస్తే, సినిమాలలో ఏదో ఒక చోట పవన్ ప్రస్తావన తేవటం, సినిమాపేరులో పవన్ పాటనో, పేరునో చేర్చటం(దీనిని హీరో నితిన్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు) సర్వసాధారణమైపోయింది. అగ్రదర్శకుడు రాజమౌళి దగ్గరనుంచి ప్రతి దర్శకుడూ అతనితో సినిమాలు చేయాలనుందని చెబుతారు. అభిమానుల సంగతి పక్కన పెట్టండి, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలామంది యువహీరోలకుకూడా అతనే ఆరాధ్యదైవం. మనిషేమైనా అందంగా, బలంగా ఉంటాడా అంటే – ఆరడుగుల బుల్లెట్ అంటారుగానీ, అంత హైట్ కూడా ఉండడు. సిక్స్ ప్యాక్ కాదుకదా…కిలో కండకూడా ఉన్నట్లు కనబడదు. విచిత్రమేమిటంటే మొదట్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను కప్పిపుచ్చుకోవటంకోసం, స్ట్రెస్‌ను కనిపించకుండా చేయటంకోసం అతను మూతి బిగించి నోట్లో నాలుకను అటూ ఇటూ తిప్పుతూ ఉంటే అదే తర్వాత…తర్వాత ఒక స్టైల్‌గా మారిపోయింది.
అసలు ఎలా వచ్చింది ఇతనికి ఇంత ప్రజాదరణ. పోనీ వందల సినిమాలు చేశాడా అంటే – తిప్పి తిప్పి కొడితే మొత్తం చేసింది 20 సినిమాలు, వాటిలో సగం ఫ్లాప్‌లు. ప్రజారాజ్యం పార్టీలో అతను చేరి ఆ ప్రయోగం విఫలమైన తర్వాతకూడా అతను సొంతంగా ‘జనసేన’ పార్టీ పెడుతున్నానని ప్రకటించగానే ఆ ప్రారంభ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలనుంచీ యువత, అభిమానులు, మహిళలు స్వచ్ఛందంగా పోటెత్తారు. మామూలుగా రాజకీయపార్టీల కార్యక్రమాలంటే లారీలు పెట్టి జనాన్ని తరలిస్తారు. కానీ అవేమీలేకుండా అతను పిలుపు ఇవ్వగానే వేలమంది స్వచ్ఛందంగా తరలిరావటం, అక్కడ లాఠీఛార్ఝిచేసే పరిస్థితి రావటం రాజకీయనేతలనే ముక్కున వేలేసుకునేటట్లు చేసింది(ఆ ప్రసంగాలు అంత ఆకట్టుకునేలా లేకపోవటం వేరే విషయమనుకోండి).
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పవన్‌కు నిజానికి ఆ ప్రాంతంకంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రజాదరణ ఉంది. తెలంగాణలో అతనిపట్ల ఉన్న అభిమానానికి ఒక ఉదాహరణను చెబుతారు. పదేళ్ళక్రితం వరంగల్ నగరంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై ఒకడు యాసిడ్ దాడి చేశాడు. వారిలో ఒక అమ్మాయి చనిపోయింది. రెండో అమ్మాయి కళ్ళకు, తలకు తీవ్రగాయలయ్యాయి. ఆ అమ్మాయిని పరామర్శించటానికి పవన్ ఆసుపత్రికి వెళ్ళాడు. అమ్మాయిని పరామర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడి కొద్దిసేపు గడిపిన తర్వాత వెళ్ళిపోయాడు. కళ్ళకు కట్లుకట్టి ఉండటంతో ఆ బాధితురాలికి వచ్చి వెళ్ళింది పవన్ అని తెలియలేదు. అతను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారు. వెంటనే ఒక్కసారి ఆయనను పిలవాలని తనవాళ్ళను కోరింది. కారెక్కబోతున్న పవన్ మళ్ళీ వెనక్కు వెళ్ళాడు. ఆ అమ్మాయి, పవన్ చేయి పట్టుకుని ఏడుస్తూ, అన్నయ్యా, వాడిని చంపేయి అన్నయ్యా, నువ్వే చంపేయాలన్నయ్యా అని అడిగింది(యాసిడ్ దాడి చేసినవాడు తదనంతరం పోలీసుల ‘ఎన్కౌంటర్’లో చనిపోయాడనుకోండి). ఇలాంటి అభిమానులు పవన్‌కు తెలంగాణలో కోకొల్లలుగా ఉన్నారు.
పవన్ గొప్ప సినిమాలు, వందలాది సినిమాలు చేయకపోయినా అతనికి ఇంత ప్రజాదరణ ఏర్పడటానికి అతని ఆఫ్‌స్క్రీన్ క్యారెక్టరే కారణమని చెబుతారు. అతనిలోని మానవతాగుణం, సాయపడటానికి ముందుకొచ్చే తత్వం, సమాజంపట్ల, సమస్యలపట్ల నిబద్ధతవంటిగుణాలపట్ల యువత బాగా ఆకర్షితులవుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండు మూడు పెళ్ళిళ్ళు, విడాకులు చేసుకున్నట్లు వార్తలొచ్చినా దానిని పెద్దగా పట్టించుకోకపోవటం విశేషం. ముఖ్యంగా సినిమా(ఆరెంజ్) నిర్మించి దివాళా తీసిన అన్నయ్య నాగబాబును ఆదుకోవటంకోసం తను ఉన్న ఇల్లుకూడా అమ్మాడని, ఆ కోపంతో భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందని ప్రచారంలో ఉన్న కథనంవలన యువతలో పవన్‌పై బాగా సానుభూతి ఏర్పడినట్లు చెబుతారు.
ఇంతటి ప్రజాదరణ ఉన్న పవన్ – ప్రేక్షకులను రంజింపచేయటమేకాదు, ప్రజలకు సేవచేయటం సమాజంపట్ల తన కర్తవ్యంగా భావించి జనసేన పార్టీ పెట్టి సంచలనమే సృష్టించారు… బాగానే ఉంది. కానీ అతను ఒక పనిని ఎంత ఉత్సాహంగా చేపడతాడో దానిని అంత ఉత్సాహంగా చివరిదాకా తీసుకెళ్ళలేడని, కామన్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దానికి ఉదాహరణ అని చెబుతారు. మరి జనసేనను ఏ తీరానికి చేరుస్తాడో చూడాలి. ఆదర్శాలు, ఆశయాలతో జనసేన ద్వారా ప్రజలకు సేవచేద్దామనుకోవటం మంచిదే. కానీ, ముక్కుసూటితత్వం, లౌక్యం తెలియని మనస్తత్వం మూర్తీభవించిన పవన్ సమకాలీన రాజకీయాలలో ఎలా ఇమడగలడన్నది ప్రశ్న. ఒకవేళ అతను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారి, ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధి అయినాకూడా అభాసుపాలవటమేతప్ప సాధించేదేమీ ఉండదని కొందరు వాదిస్తున్నారు. ఆ వాదనలో నిజం లేకపోలేదు. పవన్ ఇప్పుడున్నట్లే ఒక విజిల్ బ్లోయర్లాగా, ప్రభుత్వలోపాలను ఎత్తిచూపే సమాంతర వ్యవస్థలాగా ఉండటమే మంచిదేమో! మోడి దగ్గరనుంచి, రామోజి దగ్గరనుంచి, చంద్రబాబు దగ్గరనుంచి డబ్బుల మూటలు ముట్టాయని, ముడుతున్నాయని, భూసేకరణపైకూడా పవన్ చేసేది డ్రామా అని అతనిపై విమర్శకులు ఆరోపణలు చేస్తుంటారు. కానీ అలాంటి డ్రామాలు ఆడే వ్యక్తి, ముడుపులు పుచ్చుకునే వ్యక్తి అయితే అతనికి ఇంత ప్రజాదరణ ఉంటుందనిమాత్రం చెప్పలేము.