తెలుగు భాషకు సంబంధించి ఏపీలో ఓ ఉద్యమమే నడుస్తోంది,. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టే విషయంలో ఏపీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మేధావులు మాట్లాడుతున్నారు. రాజకీయనాయకులు గొంతు విప్పుతున్నారు. విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. భాషకు సంబంధించి ఓ ఆలజడే రేగుతోంది. కానీ… ఈ విషయమై తెలుగు సినిమా వాళ్లెవ్వరూ అస్సలు గొంతే విప్పడం లేదు. అసలు ఈ విషయం తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తెలుగుపై మమకారం మన తెలుగు సినిమా వాళ్లకు లేదా..? రాదా..? లేదంటే… ఇది రాజకీయ పరమైన సమస్యగా వదిలేస్తున్నారా..?
తెలుగు భాష గొప్పదనం గురించి చాలా సినిమాల్లో చెప్పారు. చెబుతున్నారు. మన సంప్రదాయాల్నీ, సంస్క్రృతుల్నీ కాపాడుకోవాలని డైలాగులు వల్లిస్తున్నారు. ఇవన్నీ థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవడం వరకేనా? అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనే భాషకు సంబంధించిన ఓ ఉద్యమం నడుస్తోంది. తెలుగుని బతికించుకోవాల్సిందే అంటూ.. చాలామంది గళం ఎత్తుతున్నారు. వాళ్లలో సినిమా వాళ్లే లేరు. భాషపై సినిమావాళ్ల ప్రేమ కేవలం మాటలకు, థియేటర్ల వరకే పరిమితం అనిపిస్తుంది. త్రివిక్రమ్ నుంచి కొరటాల శివ వరకూ అందరూ తెలుగుని గౌరవిస్తున్నాం అని మాట్లాడేవాళ్లే. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ..? కనీసం కనిపించడం లేదే..? ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదే…?
నిజానికి తెలుగుని లోకువ చేస్తోందే సినిమా వాళ్లు. మన తెలుగు సినిమాలకు పరాయి టైటిళ్లు పెట్టుకోవడం అంటే మోజు. చాలా వరకూ టైటిళ్లు ఇంగ్లీషులోనే కనిపిస్తున్నాయి. అదో ప్యాషన్ అయిపోయింది. టైటిల్ తెలుగులో ఉన్నా, క్యాప్షన్ ఇంగ్లీషులో ఉండాల్సిందే. అది రూలైపోయింది. తెలుగు సినిమాల్లో తెలుగు నటీనటులు కనిపించరు. పరాయి రాష్ట్రం నుంచి బోలెడన్ని డబ్బులు పోసి ఆర్టిస్టుల్ని దిగుమతి చేసుకుంటారు. వాళ్ల వచ్చీ రానీ గొంతుతోనే డైలాగులు చెప్పించుకుంటారు. అదే ట్రెండ్ అయిపోతుంది. పాటల్లోనూ ఇంగ్లీషు పదాల మోతే. తెలుగులో ఎంతోమంది గాయకులున్నారు. వాళ్లని ప్రోత్సహిస్తున్నదెంతమంది. అద్నాన్ సమీ, బాబా సైగల్, సిద్ద్ శ్రీరామ్… వీళ్ల వచ్చీ రాని తెలుగు పాటలనే హిట్ చేసేసుకుంటున్నాం. ఇదీ మన తెలుగు దౌర్భాగ్యం.
ఇంతటి ప్రేమ ఉన్న తెలుగు సినిమావాళ్లకు తెలుగు ఉద్యమంలో ఓ చేయి వేయాలని ఎందుకు అనిపిస్తుంది..? ప్రశ్నించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది..? కాకపోతే.. మైకు పట్టుకున్నప్పుడో, ఆడియో వేడుకల్లోనో, సినిమాల్లో డైలాగులు చెబుతున్నప్పుడో… అమ్మ భాష – అమృత భాష అంటూ రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు ఇవ్వమాకండి. ఎందుకంటే… అలాంటి డైలాగుల్ని కూడా జోకులు అనుకుని నవ్వుకోవాల్సివస్తుంది.