సినీ నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి తామే ప్రభుత్వం టిక్కెట్లు అమ్మాలని కోరామని ప్రకటించారు. అయితే ఒక్క ప్రభుత్వాన్నే ఎందుకు కోరారు.. తెలంగాణను ఎందుకు కోరలేదన్న సమస్య సహజంగానే వస్తుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు. ప్రభుత్వం అన్నింటితో పాటు సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. టిక్కెట్ రేట్ల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, షోల విషయంలోనూ కొత్తగా నిబంధనలు పెట్టలేదు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తి స్తాయిలో సహకరిస్తోంది.
సినిమాల విడుదలకు ఏపీలో అనేక రకాల ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా వంద శాతం టిక్కెట్ల అమ్మకానికి చాన్స్ లేదు. అదే సమయంలో టిక్కెట్ రేట్లపై నియంత్రణ ఉంది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ జీవో తెచ్చారు. ఈ లోపు టిక్కెట్లను తామే అమ్ముతామంటూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోందో సినీ పెద్దలకు మాత్రమే తెలుసు. అందుకే జగన్ తో భేటీలు వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం తమ సాధారణ వ్యాపారాన్ని చేసుకోవడానికి కూడా తిప్పలు పెడుతూండటం చూసి.. వారు దిగజారిపోతున్న వైనం ఇతరులకు కామెడీగా మారింది. చివరకు ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. అదేమిటంటే నిర్మాతల డబ్బులన్నీ ప్రభుత్వ అకౌంట్లలో వేస్తే.. ఇక ప్రభుత్వమే ఆ డబ్బులను ఆర్టిస్టులకు.. నటులకు బిల్లులు పేమెంట్ చేయాలట. ఏపీ ప్రభుత్వానికి ఇదేదో బాగుందనిపిస్తే.. వాళ్లే అడిగారని చెప్పి అమలు చేస్తుంది. అప్పుడు కూడా నోరెత్తే ధైర్యం ఎవరూ చేయలేరు. అలా ఉంది టాలీవుడ్ పరిస్థితి.