రాత్రి చేసిన హడావుడి .. తెల్లారేసరికి చల్లారిపోయింది. రాత్రి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ.. రచ్చ రచ్చ చేసిన ఆ పార్టీ మంత్రులు.. కొన్ని ్నుకూల మీడియా.. ఉదయానికి చల్లబడిపోయాయి. బీజేపీ నేతలు ఈ ఫామ్ హౌస్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టి రెండు, మూడు గంటలు చెప్పిందంతా చెప్పారు. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారని.. బుధవారం సాయంత్రం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వచ్చారు. మళ్లీ బయటకు వెళ్లారో లేదో తెలియదు. బీజేపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే పోలీసులు మాత్రం… మొత్తం రూ. 250 కోట్ల డీల్ జరగబోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ స్పాట్లో ఎంత క్యాష్ పట్టుకున్నారో చెప్పలేదు. అసలు పట్టుకున్నారో లేదో స్పష్టత లేదు. ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. మరో వైపు ఈ కేసులో ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల తీరు.. ఎఫ్ఐఆర్ విషయంలోనే గందరగోళం ఉంది. అందుకే బీజేపీ నేతుల వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ లేద సిట్‌తో దర్యాప్తు చేయించాలన్నారు.
తనను బీజేపీ నేతలు ప్రలోభపరిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. అయితే ఆ సతీష్ శర్మ.. నందకుమార్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని నిరూపించే సాక్ష్యాలు లేవు. వారు బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నందకుమార్ టీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహితంగాఉంటారు. ఆ ఫోటోలూ వైరల్ అయ్యాయి.
మొత్తంగా గంటన్నర రికార్డు చేశామని.. అమిత్ షా వాయిస్ రికార్డు అయిందని.. కిషన్ రెడ్డి వీడియోలు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు కానీ గురువారం ఉదయం నుంచి వారెవరూ బయట మాట్లాడటం లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.