హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి కేసీఆర్‌పై నిన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఖమ్మంలో నాడు నిమ్మరసం తాగి దీక్ష విరమించటంపై వివరణ ఇవ్వకపోవటాన్ని, నిమ్స్‌లో నిరాహారదీక్ష సాగించిన వైనాన్ని జైపాల్ రెడ్డి ఎత్తిచూపారు. ఖమ్మంలో దీక్ష విరమించినా, ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల ఒత్తిడి మేరకు దీక్షను కొనసాగించాడని అన్నారు. నిమ్స్ డ్రామాను కూడా బయటపెడతానని చెప్పారు. కేసీఆర్ మర్యాద పోగొడితే ఉద్యమం బలహీనపడుతుందనే నాడు ఇవన్నీ బయటపెట్టటంలేదని అన్నారు. తన విమర్శలకు ఆధారంగా నాడు ఖమ్మంలో కేసీఆర్ దీక్ష విరమిస్తున్నప్పటి వీడియోను కూడా మీడియా ముందు ప్రదర్శించారు.
మామూలుగా ప్రత్యర్థుల విమర్శలపై ఒంటికాలుమీద లేచే టీఆర్ఎస్ పార్టీ నిన్న జైపాల్ రెడ్డి విమర్శలపై నోరు మెదపకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం నిన్న వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో జైపాల్ రెడ్డి విమర్శలను ఒక్కసారి ప్రస్తావించారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి విమర్శలు అర్థరహితమని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ తెచ్చేవారా అని ప్రశ్నించారు. అయితే తన తండ్రి నిరాహార దీక్ష అంశంపై జైపాల్ రెడ్డి చేసిన విమర్శలను మాత్రం ప్రస్తావించలేదు.