మంత్రులకు సహజంగానే వారి సొంత జిల్లాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి మంచి గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఒక నేత మంత్రి అయ్యారంటే జిల్లాలో ప్రముఖ నేత కిందే చలామణి అవుతారు. కానీ, ఈ మహిళా మంత్రి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సొంత జిల్లాలోనే సొంత పార్టీ నేతలు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ పరిస్థితికి కారణం తెరాసలో ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే… సత్యవతి రాథోడ్.
తెరాసలో చేరిన తరువాత ఎమ్మెల్సీ అయ్యారు సత్యవతి. ఆ తరువాత, అనూహ్యంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమెకి ఒక సన్మాన సభగానీ, పూల బొకేగానీ ఇచ్చిన దాఖలాలు లేవు. చివరికి, మంత్రి హోదా ఆమె వరంగల్ జిల్లాకి వచ్చినా కూడా స్థానిక తెరాస నేతలు పెద్దగా స్పందించడం లేదు. పల్లా రాజేశ్వరరెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాగానే రైతులు పెద్ద ఎత్తున సభ పెట్టారు. ఎర్రబెల్లి దయాకరరావు మంత్రి పదవి వచ్చినప్పుడు తెరాస నేతలు ఆయనకి భారీగా స్వాగతం పలికారు. వినయ్ భాస్కర్ కి ఛీఫ్ విప్ పదవి వచ్చేసరికి అప్పుడూ స్థానిక నేతలు ఆయనకి సన్మానాలు చేశారు. చివరికి, జిల్లాకి వస్తున్న ఇతర మంత్రులకు దక్కుతున్న ప్రాధాన్యత కూడా ఆమెకి స్థానిక నేతలు ఇవ్వడం లేదు.
ఈ పరిస్థతి ఎప్పట్నుంచో ఉన్నా… ఈ మధ్య పల్లా రాజేశ్వరరెడ్డికి రైతులు సన్మానం చేసిన దగ్గర్నుంచీ మంత్రి సత్యవతి రాథోడ్ అంశం తెరాస వర్గాల్లో చర్చకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ పరిస్థితిని భరిస్తూ వచ్చిన సత్యవతి… ఈ మధ్య కొంత అసహనానికి గురౌతున్నారట. తెరాసలో కొంతమంది నాయకులకే గుర్తింపు ఉంటుందా, మాలాంటి వారిని ఎవ్వరూ పట్టించుకోరా అంటూ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారిక కార్యక్రమాల మీద జిల్లాకి వస్తున్నా… స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో కూడా ఆమె బస చేయడం లేదు! జిల్లాలో కొంతమంది నేతల ఆధిపత్య పోరు వల్లనే తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆమె అభిప్రాయంగా తెలుస్తోంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి తన పట్టు సడలనీయకుండా, మరొకరికి అవకాశం ఇవ్వకుండా పార్టీ వర్గాలను కట్టడి చేస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. మున్ముందు ఈ పరిస్థితి ఎలా పరిణమిస్తుందో చూడాలి.