హైదరాబాద్: తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన 18 నెలల తర్వాత జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులకు డిపాజిట్లుకూడా రాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్ ప్రజలు అధికారపార్టీకి అనుకూలంగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. రైతుల ఆత్మహత్యల పరంపర నిరంతరంగా కొనసాగుతున్నాయని, ఎన్నికలముందు ఇచ్చిన లెక్కకు మించిన హామీలలో ఏదీ నెరవేర్చటంలేదని, పలువర్గాలలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ప్రతిపక్షాల నేతలు ఓటర్ల చెవుల్లో ఇళ్ళుకట్టుకుని చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రజలు ఒన్సైడెడ్గా టీఆర్ఎస్కు ఓట్లు వేసేశారు. ఈ 18 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తమకు ఈ అఖండ విజయాన్ని సంపాదించిపెట్టాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దేశమంతా తెలంగాణవైపు చూస్తోందని అంటున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి అఖండ విజయానికి ప్రధాన కారణంగా – అధికారపక్షానికి ఉపఎన్నికలలో ఎడ్వాంటేజ్ ఉంటుందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. అధికార పార్టీ తన సర్వశక్తులూ అక్కడ కేంద్రీకరించటంతోపాటు అధికార యంత్రాంగాన్నిదుర్వినియోగపరుచుకోవటం సర్వసాధారణంగా జరిగే విషయమే. దానికితోడు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఉండటం, రాష్ట్రమంత్రులుగా ఉన్న టీఆర్ఎస్ అగ్రనేతలందరూ ఏడు సెగ్మెంట్లను పంచుకుని, పదిరోజులు అక్కడే మోహరించి పోల్ మేనేజ్మెంట్ చేయటం బాగా ప్రభావం చూపింది. ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు అభ్యర్థులను బయటనుంచి దిగుమతి చేసుకోవటం, పసునూరి దయాకర్ స్థానికుడైన సామాన్య కార్యకర్త కావటం మరో ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇది కాక, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా చేశారో, యాధృచ్ఛికమోగానీ ఎన్నికలకుముందే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటం, ప్రభుత్వోద్యోగుల సకలజనులసమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తానని నిర్ణయం తీసుకోవటం, క్రిస్టియన్ పండుగ నెలా 15 రోజులు ఉండగానే క్రైస్తవులకు అనేక తాయిలాలు ప్రకటించటం(వరంగల్ నియోజకవర్గంలో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉంది), హైదరాబాద్‌లో నిరుపేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆర్భాటంగా ప్రారంభించటం(సహజంగానే మిగిలిన ప్రాంతాలలోకూడా ఈ ఇళ్ళు వస్తాయని ఆశలు రేగుతాయి), ప్రత్తిరైతుల సమస్యల గురించి టీఆర్ఎస్ మంత్రులు కేంద్ర మంత్రులతో గొడవ పెట్టుకోవటం వంటి పరిణామాలన్నీ జరిగాయి. ఇవన్నీ ఓటర్లపై విశేషమైన ప్రభావాన్ని చూపాయి. వీటన్నిటితోపాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలీపోవటంకూడా మరో కారణంగా చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు తమ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెెస్, టీడీపీలతో చర్చించి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామని వామపక్షాలు ఎన్నికలకు ముందు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సత్ఫలితాలనివ్వలేదు. అది జరిగిఉంటే ఫలితంలో తప్పకుండా తేడా ఉండేదని చెప్పొచ్చు.
ఏది ఏమైనా టీఆర్ఎస్కు ప్రజలు ఇంకా కొంతకాలం హనీమూన్ గడపటానికి(ఎక్స్టెండెడ్ హనీమూన్) అవకాశం ఇస్తున్నారనే విషయం స్పష్టమయింది. రాష్ట్రం కొత్తది కాబట్టి సమస్యల పరిష్కారానికి, పరిపాలన గాడిలో పడటానికి ప్రభుత్వానికి టైమ్ పడుతుందని మాత్రం ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార గర్వంతో విర్రవీగుతున్న కేసీఆర్‌కు, ఈ ఉపఎన్నికలో వ్యతిరేక ఫలితం ఎదురైతే ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుందని, ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేస్తారని టీఆర్ఎస్ శ్రేయోభిలాషులతోసహా తెలంగాణలోని పలువర్గాలు ఆశించినప్పటికీ అలా జరగలేదు. మరి ఈ ఫలితం తెలంగాణకు మంచి చేస్తుందో, చెడు చేస్తుందో రానున్నకాలంలో తెలుస్తుంది.