మొన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నిన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇప్పుడు బుడ్డా శేషారెడ్డి..!… వీరంతా.. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు తీసుకున్నవారే. కానీ చివరి క్షణంలో తాము పోటీ చేయలేమని చెబుతున్నారు. ఇందుకు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకున్నారు. ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ హఠాత్తుగా… వైసీపీ లిస్ట్ ప్రకటించే ఒక్క రోజు ముందు కండువా కప్పుకుని.. ఆ పార్టీ తరపున నెల్లూరు లోక్శభకు పోటీ చేస్తున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి రెండేళ్ల కిందటే.. ఎంపీ టిక్కెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. కానీ ఆయన పోటీ చేయడానికి ఇష్టపడక.. వైసీపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఆయన తన భార్య ఆరోగ్యాన్ని కారణంగా చెబుతున్నప్పటికీ.. వెనుక ఇంకేదో కారణం ఉందని… నమ్మక తప్పదు.
ఎమ్మెల్యే , ఎంపీ టిక్కెట్లు కేటాయించిన తర్వాత వీరందరూ ఎందుకు పోటీకి వెనుకడుగు వేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. టీడీపీ తరపున పోటీ చేస్తే గెలవలేమని భావిస్తున్నారని.. వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ పరిణామాలు ఉపయోగపడుతున్నాయి. దీనిపై టీడీపీ అగ్రనేతలు ముందుగా ఎందుకు కసరత్తు చేయలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది. వారికి ఇతర పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉండి.. వారు పార్టీలో ఉండరు అని అనిపించినప్పుడు.. టిక్కెట్లు ఎందుకు ఖరారు చేశారనే సందహం ముందుగానే వస్తుంది. బలమైన అభ్యర్థులైనప్పటికీ.. టీడీపీ తరపున పోటీ చేయడానికే… వెనుకాడిన వారు.. తర్వాత గెలిచినా… పార్టీలో ఉంటారన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టీడీపీ హైకమాండ్ దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు.
కారణం ఏదైనా కానీ.. టీడీపీ తరపున… పోటీ చేయడానికి ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు జంకుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడటానికి… టీడీపీ ముఖ్యనేతలు చేసిన వ్యూహాత్మక తప్పిదాలే కారణం. ఇక ముందు ఒకరిద్దరు నేతలు.. ఇలా… పోటీకి దూరమైనా… పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అనుకోవచ్చు.