నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకి లేఖ ఇచ్చారు. అంతేకాదు, భాజపా నాయకులు దగ్గరుండి వెళ్లి మరీ విలీన పత్రం అందించారు. టీడీపీ నేతల్ని భాజపా నాయకుడు వెంటబెట్టుకుని మరీ వెళ్లి పార్టీలో చేర్చుకోవడం విశేషం! ఎందుకంటే, ఈ మధ్య మనం తరచూ ఫిరాయింపులు చూస్తున్నాం. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎల్పీ తెరాసలో చేరింది. ఆ ప్రక్రియను తెరాస నేతలెవ్వరూ దగ్గరుండి నడిపించలేదు. స్పీకర్ దగ్గరకి తెరాస నాయకులెవ్వరూ వాళ్లని తీసుకెళ్లలేదు! సరే… టీడీపీలో ఈ ఆపరేషన్ నుంచి భాజపా నడిపించిందనేది అర్థమౌతూనే ఉంది. అయితే, ఈ నలుగురు ఎంపీల చీలికను గుర్తించే అధికారం రాజ్యసభ ఛైర్మన్ గా ఉప రాష్ట్రపతికి ఉంటుందా అనేదే ఇప్పుడు చర్చనీయం.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి విలీనం చేయాలంటూ లేఖ రాశారు. అయితే, దీనికి భాజపా నేతలు చెబుతున్నది ఏంటంటే…. ఒక ప్రాంతీయ పార్టీ సభ్యులు, ఒక జాతీయ పార్టీలోకి విలీనం కావడం రాజ్యంగబద్ధమే అని అంటున్నారు. వివిధ టీవీ ఛానెల్స్ మాట్లాడుతున్న భాజపా నేతలు ఇది సరైన చర్యగానే చెబుతున్నారు. కానీ, జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ విలీనాలకి సంబంధించి వేర్వేరుగా ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్థావన లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కూడా ఎక్కడా జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్య తేడా గురించి ప్రస్థావించలేదంటున్నారు. ఒరిజినల్ పార్టీ అని మాత్రమే ఉంటుందనీ, కాబట్టి ఒరిజినల్ పార్టీలో చీలిక వస్తేనే తప్ప… ఈ విలీనం అనేది రాజ్యంగబద్ధం కాదని చెబుతున్నారు. ఒక పార్టీకి చెందిన పార్లమెంటరీ పక్షమో, లేదా శాసన సభా పక్షమో ప్రత్యేకంగా చీలిపోయి విలీనం అనేది అసాధ్యమంటున్నారు. పార్టీ వేరు.. ఆయా పార్టీలకు ఉన్న శాసనసభా, లేదా పార్లమెంటరీ పక్షాలు వేరుగా ఉండవు కదా!
కాబట్టి, ఒరిజినల్ పార్టీలో చీలిక అనేది వస్తే… దాన్ని గుర్తించే అధికారం రాజ్యసభ ఛైర్మన్ కి ఉండదు. ఎందుకంటే, రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ అనేది ఎన్నికల కమిషన్ కి సంబంధించిన విషయం. కాబట్టి, రాజకీయ పార్టీల చీలికను కూడా గుర్తించాల్సింది ఎన్నికల సంఘమే. సో… విలీనాలైనా, చీలికలైనా వాటిని గుర్తించే అధికారం సభా పతులకు ఉండదు అనేది రాజ్యాంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.