ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న హడావుడి చూస్తున్నాం. ఏపీలోని ఉన్నతాధికారులపై నమ్మకం లేదంటారు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటారు, ఎన్నికలు విధులకు ఏపీ అధికారులకు పనికిరారంటారు… మొత్తానికి, ఏదైతేనేం అనుకున్నట్టుగానే ఫిర్యాదులు చేశారు, ఆశించినట్టుగానే ఈసీ ద్వారా కొన్ని బదిలీలూ మార్పులూ చేయించుకున్నారు. ఎన్నికలు జరిగిపోయాయి కదా.. ఇక్కడితో ఆగొచ్చు కదా! కానీ, ఆయన ఇంకా హడావుడి పడుతూనే ఉన్నారు. ఈవీఎంలను ఎలా భద్రంగా స్ట్రాంగ్ రూముల్లో దాచాలో ఎన్నికల సంఘానికే సూచనలు ఇస్తూ మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానికి కూడా రాష్ట్ర పోలీసులు పనికిరారు, కేంద్ర బలగాల పహారా పెట్టాలీ, సీసీ టీవీ కెమెరాలు పెట్టాలంటూ ఓ పెద్ద లేఖ రాశారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలకు ఒక సర్క్యులేషన్ జారీ చేశారు.
స్ట్రాంగ్ రూముల వద్ద వైకాపా ప్రతినిధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు విజయసాయిరెడ్డి. అన్ని జిల్లాల్లో ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయనీ, వాటికి మూడంచెల భద్రత కల్పిస్తారని నేతలకు చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు వరకూ పార్టీకి చెందినవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ బయట టెంట్ వేసుకుని, ఒక్కో రాజకీయ పార్టీకి ఇద్దరు ప్రతినిధులు ఉండే అవకాశం ఉంటుందనీ, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. 24 గంటలు షిఫ్టులో ఒకరు లేదా ఇద్దరు చొప్పున ప్రతినిధులు అక్కడ ఉండాలనీ, మూడు షిఫ్టుల్లో అయినా ప్రతినిధులు అక్కడ ఉండొచ్చని జిల్లాలకు చెందిన నేతలకు ఆయన సూచించారు.
ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇవన్నీ ఎన్నికల సంఘం విధులు. ఈవీఎంలకు ఎలాంటి భద్రత కల్పించాలో వారు చూసుకుంటారు. ఈసీకి ఇవన్నీ కొత్తేం కాదు. స్ట్రాంగ్ రూముల దగ్గర పార్టీల ప్రతినిధులు ఉండటం కూడా సర్వసాధారణమైన విషయమే, రెగ్యులర్ గా జరిగేదే. దీనిపై టెన్షన్ పడాల్సిన పనిలేదు. బహుశా ఆయనకి ఎన్నికలు కొత్తేమో అనే అభిప్రాయం కలిగించేలా ఆయన హడావుడి పడుతున్నారు. ఈ అతి స్పందన చూస్తుంటేనే… ఈసీ పనితీరుపై వారికి కూడా అనుమానాలున్నాయా, వారికీ పూర్తిగా నమ్మకం లేదేమో అనిపిస్తుంది. లేదంటే, ఎన్నికలు సంఘం చేయ్యాల్సిన రోజువారి విధులను కూడా ఎలా నిర్వర్తించాలనే సలహాలు విజయసాయి రెడ్డి ఇవ్వడమెందుకు?