బాహుబలి’తో తెలుగు సినిమా సైజ్ మారింది. ప్లాన్ చేసి తీస్తే ప్యాన్ ఇండియా ఆడే సినిమాలు మనమూ చేయగలమనే బరోసా ఇచ్చింది బాహుబలి. అదే ప్రేరణతో ‘సాహో’ సినిమా కూడా వచ్చింది. కానీ బాక్సాఫీసు దగ్గర పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మరో బడా సినిమా విడుదలకు సిద్ధమైయింది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ మరో కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై బోలెడు అంచనాలు వున్నాయి. ఈ సినిమాని ఎందుకు చూడాలనే ప్రశ్నకు అనేక సమాధానాలు.
దాదాపు రూ. 250కోట్లతో సైరాని నిర్మించారు. బాహుబలి, సాహో తర్వాత తెలుగులో ఇదే పెద్ద బడ్జెట్ సినిమా. నిర్మాత రామ్ చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనకడుగువేయలేదు. ఆ సంగతి ట్రైలర్ లో కనిపించింది. కళ్ళు చెదిరే విజువల్స్ కనిపించాయి. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి చేస్తున్న బయోపిక్ ఇది. అందులోనూ ఓ ఫ్రీడమ్ ఫైటర్ గా చిరు చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. అల్లూరి సీతారామరాజు తర్వాత సరైన యోధుడి కధ తెలుగు తెరపై రాలేదు. ఇప్పుడు చరిత్ర మర్చిపోయిన ఓ యోధుడి కధ సైరాలో చూపించబోతున్నారు. ఈ రకంగా కధ పరంగా కూడా సైరా విలక్షణమైనది.
సైరాలో మరో మేజర్ హైలెట్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. బిగ్ బి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ గాడ్. చిరంజీవి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కింగ్. ఇప్పుడు వీరిద్దరూ ఒకే ఫ్రేంలో కనిపిస్తున్నారు. ఇంతకంటే స్పెషల్ ఎట్రాక్షన్ ఏం కావాలి. అమితాబ్ ఇది వరకూ తెలుగు సినిమాలో ఒకటి లేదా రెండు షాట్స్ లోనే కనిపించారు. అది కూడా గెస్ట్ రోల్. కానీ సైరాలో ఒక కీలక పాత్ర చేశారు. సైరాకి గురువుగా కనిపిస్తున్నారు. ఆయన రోల్ చాలా కీలకమని చెబుతుంది సినిమా యూనిట్. సో తెలుగు స్క్రీన్ లో మొదటిసారి అమితాబ్ పెర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ సైరాతో దక్కనుంది. అంతేకాదు.. నయనతార, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి.. ఇలా భారీ తారాగణం వున్న సినిమా సైరా.
నిర్మాణ పరంగా చూసుకుంటే బాహుబలి కంటే సైరాలోనే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ వున్నాయని స్వయంగా రాజమౌళినే చెప్పారు. ట్రైలర్ లో కొన్ని కనిపించాయి. ఇంక సినిమాలో ఎలా వుండబోతున్నాయన్నది కూడా ఆసక్తికరం. దీంతో పాటు కంప్లీట్ పిరియడ్ సినిమా ఇది. ఒక్క షాట్ కూడా వర్తమానంలో వుండదు. సో.. అప్పటి పరిస్థితులని, వాతావరణంని ఎలా తెరపైకి తెచ్చుంటారనేది కూడా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.
ఇక సైరా సినిమా టాలీవుడ్ భవిష్యత్ కీ కీలకం. బాహుబలితో దేశం గొప్పగా చెప్పుకునే సినిమా అందించింది తెలుగు పరిశ్రమ. ఇప్పుడు సైరా కూడా అంత స్టామినా వున్న సినిమానే. బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో భారీగా విడుదల కానుంది. సైరా కనుక అనుకున్నంత విజయాన్ని సాధిస్తే.. మరిన్ని పెద్ద సినిమాలు తెలుగు పరిశ్రమ నుండి వచ్చే అవకాశం వుంది.