మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. సంవత్సరం దాటిపోయింది. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను స్పీకర్ ఇంతవరకూ ఆమోదించలేదు. టీడీపీ సభ్యులు రాజీనామాలు చేయాలని అదే పనిగా సవాళ్లు చేస్తున్న వైసీపీ.. తమతో చేరిన టీడీపీ సభ్యులతో రాజీనామాలు చేయించలేదు. అలాగే చేరకపోయినా రాజీనామా చేస్తామని ముందుకొచ్చిన గంటా రాజీనామాను ఆమోదించడం లేదు. ఆయన పదే పదే స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటంలేదు. దీంతో ఇప్పుడు ఆయన కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
గంటా రాజీనామాను ఆమోదించడం స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిమిషం పని. కానీ ఆయనకు వైసీపీ హైకమాండ్ నుంచి సిగ్నల్స్ రాకపోతే మాత్రం ఏమీ చేయరు. వైసీపీ వ్యూహం ప్రకారమే రాజీనామాల ఆమోదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉపఎన్నికను వైసీపీ కోరుకోవడం లేదని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినందన విశాఖలో దుమ్మురేపే విజయం వస్తుందని వైసీపీ చెబుతోంది. కానీ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎందుకు కాలదన్నుకుంటోందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.
ఏపీలో గౌతం రెడ్డి మరణం కారణం ఓ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. గంటా రాజీనామాను ఆమోదిస్తే రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతాయి. గౌతం రెడ్డి స్థానంలో టీడీపీ పోటీ పెట్టే అవకాశం లేదు. అక్కడ్నుంచి మేకపాటి కుటుంబీకులే పోటీచేస్తారు. కానీ గంటా రాజీనామా చేసినా టీడీపీ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఎజెండాతో ఆయనను ఇండిపెండెంట్‌గా నిలబెట్టి అందరూ మద్దతు ప్రకటిస్తారు. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందికరమే. అందుకనే ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా..ఇప్పటి వరకూ అన్ని ఎన్నికల్లో దున్నేశామని చెప్పుకుంటున్న వైసీపీ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి భయపడుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.