బీజేపీ నేతలు ఎవరైనా వచ్చి ” మీరు ఎదవలు రా ” అని తిడితే… ఏదో మీ అభిమానం అని… షిక్కటి చిరునవ్వుతో తడుచుకుని వెళ్లిపోవాలన్న రూల్ ను ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టి… మద్యం స్కాం దగ్గర్నుంచి శాంతి భద్రతల అంశం వరకూ అన్నింటిపైనా విమర్శలు చేశారు. అంతిమంగా ఓ పనికి మాలిన ప్రభుత్వం ఉందని తేల్చారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం… స్పందించడానికి తటపటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం తీసుకుంటే తీసుుకోవచ్చని… అంబటి రాంబాబు గౌరవంగా సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఇస్తే క్రెడిట్ తీసుకోవచ్చని.. విజయసాయిరెడ్డి నంగి నంగిగా ఓ ట్వీట్ పెట్టారు తప్ప.. ఇంకెవరూ స్పందించలేదు.
బీజేపీ తో ఇప్పటికిప్పుడు వైరం పెట్టుకోకూడదని వైసీపీ అనుకుంటోంది. జాతీయ నేతలు వచ్చి తిట్టినా .. రాష్ట్ర నేతలు విమర్శలు చేసినా మౌనంగా ఉంటున్నారు. సైలెంట్ గా ఉన్నామని వారు చేసిన ఆరోపణలన్నీ నిజమని అంగీకరించినట్లు అవుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉన్నా ఎవరూ నోరు మెదపడం లేదు. కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ లేదు. ఎన్నో అంశాలపై కేంద్రంతో రాజీపడ్డ వైసీపీ సర్కార్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. తేడా వస్తే ఏమవుతుందో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉదంతమే చూపిస్తోంది.
ఇప్పటికే టీడీపీ ఎన్డీయేకు దగ్గరవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ఏదన్నా పొరపాటున బీజేపీ నేతలపై ఎదురు తిరిగితే జగన్ భవిష్యత్ కు గ్యారంటీ ఉండని పరిస్థితి. అందుకే ఏపీ బీజేపీ విషయంలో వైఎస్సార్సీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అందుకే జనసేన, టీడీపీ టార్గెట్ గా వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా బీజేపీని మాట అంటే ఢిల్లీ నుంచి వచ్చిపడే తిట్లు తట్టుకోలేక వైసీపీ భరిస్తోందని అందరి అభిప్రాయం.