ఒక వ్యాపార సంస్థ దివాలా తీసిందనడానికి సాక్ష్యం.. ఆదాయం లేకపోవడం, వ్యాపారం లేకపోవడం. ఓ రాజకీయ పార్టీ దివాలా తీసిందడానికి కూడా ఇలాంటి కారణాలే ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, చట్టసభలకు హాజరు కాకపోవడం వంటివి. ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ ప్రధాన విధులు ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభలకు హాజరు కావడం. ఈ రెండు చేయని పార్టీలు రాజకీయంగా దివాలా తీసినట్లే. ఆస్థాయికి వైసీపీ చేరుకుంది.
అసెంబ్లీకి పోరట- మీడియా ముందు మాట్లాడేందుకు ఎమ్మెల్యే పదవులెందుకు ?
జగన్ రెడ్డి అతి తెలివికి రాష్ట్ర ప్రజలంతా విస్మయానికి గురువుతున్నారు. అసెంబ్లీకి వెళ్లమని పదకొండు మందికి ప్రజలు అవకాశం ఇస్తే..మాకు మైక్ ఇవ్వరని ముందే నిర్ణయించేసుకుని పోయేది లేదని అంటున్నారు. తాను మాత్రమే కాదు తన ఎమ్మెల్యేలను కూడా పోనివ్వనని జగన్ అంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఏ మాత్రం కనీస అవగాహన ఉన్నా.. తాను కాకపోతే కనీసం ఎమ్మెల్యేలను పంపుతారు. ఎమ్మెల్యేలు ఫోకస్‌లోకి రావడం ఇష్టం ఉండదు. అందుకే ఆయన పంపరు. అసెంబ్లీకి పోని ఎమ్మెల్యేలకు పదవులు ఎందుకు రాజీనామా చేయమనే డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి ?
ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి మనుగడ కష్టమే
అధికారంలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ పోటీ చేశారు. ఇప్పుడు అధికారం లేకపోయే సరికి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి జంకుతున్నారు. బాయ్ కాట్ చేశారు. దానికి ఏదో కారణాలు చెప్పారు. ఇవే కారణాలు రేపు స్థానిక ఎన్నికలలోనూ చెప్పి వైదొలుగుతారా?. ప్రధాన ఎన్నికల్లోనూ చెప్పి వైదొలుగుతారా…గెలుపో ఓటమో ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇక రాజకీయ పార్టీ అనవసరం.
క్యాడర్‌తో తప్పుడు పనులు చేయించే పార్టీ
ఏ రాజకీయ పార్టీ అయినా క్యాడర్ ను కాపాడుకుంటుంది. కానీ వైసీపీ మాత్రం తమ అధినాయకుడి ఆలోచనలకు తగ్గట్లుగా క్యాడర్‌ను అసాంఘిక శక్తులుగా మార్చేస్తారు. ఏదో చిల్లర పడేసి వాళ్లను సోషల్ మీడియా సైకోలుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను నియమించి.. వారికే ప్రాధాన్యం ఇచ్చారు. అధికారం పోయాక కార్యకర్తలను బలి చేస్తున్నారు. ఇలాంటి పార్టీకి నిఖార్సుగా పని చేసే క్యాడర్ కూడా మిగలరు.
మొత్తంగా వైసీపీ దివాలా తీసింది. ఇక పూర్తిగా మూసేయడానికి ఎంత కాలం పడుతుందో వేచి చూడాలి.