తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం.. తెలంగాణలో ఆ పార్టీ శ్రేణుల్ని ఆనంద పరిచింది. ఇది సహజమే. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి.. వారికి ఆ ఆనందం ఉంటుంది. మరి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు ఎందుకు.. టీఆర్ఎస్ విజయాన్ని కలసికట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాయి. అటు జగన్ , ఇటు పవన్ .. ఇద్దరూ ఒకరి మగతనం మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కానీ… ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు…?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ, జనసేనల హడావుడి ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి… మరింత ఎక్కువైంది. టీడీపీ, కాంగ్రెస్ తో పాటు.. మరో రెండు పార్టీలతో జత కట్టడం అన్నది.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశం. కానీ.. జనసేనతో పాటు జగన్ కూడా.. ఈ ప్రయత్నాలపై తీవ్రమైన విమర్శలు చేయడం ప్రారభించారు. అలా అంటున్నారంటే.. వారేమైనా విడిగా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారేమోనని అందరూ అనుకుంటారు. కానీ వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎవరో చెప్పినట్లుగా.. ఎన్నికలకు దూరమయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఓడిపోతే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీడీపీ ఓటమే.. వీరి విజయంగా ఫీలవుతున్నారా..?
తెలుగుదేశం పార్టీ అధినేతగా… తెలంగాణలో ఉన్న పార్టీ నేతలకు అండగా ఉండేందుకు చంద్రబాబు రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఓడిపోతే.. ఎదుర్కోవాల్సిన పరిణామాలు గట్టిగానే ఉంటాయని తెలిసినా ముందడుగు వేశారు. కానీ జగన్, పవన్ లా.. ఎన్నికలకే దూరం కాలేదు. చంద్రబాబును ఓడించాలని కోరుకోవడం తప్పు లేదు కానీ.. ఎవరో ఓడిస్తే.. తాము సంతోషంలో మునగడంలో అర్థం లేదు. అది రాజకీయం కాదు. కనీసం.. రాజకీయ లక్షణం కూడా కాదు.