నంద్యాల ఎన్నికల్లో వైసీపీ 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అన్నే ఓట్ల తేడాతో గెలుస్తామని.. సంబరపడిన.. వైసీపీ ఘోరంగా ఫలితం తిరగబడటంతో షాక్కు గురయింది. పైకి ఏవేవో కారణాలు చెప్పుకున్నారు. కానీ.. నిజాయితీగా… తమ ఓటమికి కారణం ఏమిటో.. ఒక్క గంట అంటే.. ఒక్క గంట కూడా సమీక్ష చేసుకోలేదు. కనీసం.. ఎవర్నీ నివేదికలు అడగలేదు. అభ్యర్థిని అడగలేదు.. అంతకు మించి… పార్టీ యంత్రాంగం నుంచి వివరాలు సేకరించలేదు. అంటే… ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు వైసీపీ నేతలు ఏ మాత్రం సిద్ధంగా లేరని అర్థం. ఇప్పటికీ అదే పద్దతి కొనసాగుతోంది.
చేస్తున్న పనుల నుంచి తప్పొప్పులను తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటే తప్ప… ముందడుగు వేయడం అసాధ్యం. ఇది ఏ చిన్న వ్యాపార సంస్థ లేదా… రాజకీయ పార్టీని నడిపేవారికి అయినా తెలుసు. ముఖ్యంగా రాజకీయ పార్టీ విషయంలో.. ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ.., వారి మనోభావాలకు అనుగుణంగా.. తమను తాము మార్చుకున్న రాజకీయ నాయకుడే ప్రజల్లో నిలబడగలుగుతారు. అదే సమయంలో.. అంతర్గతంగా తమ పార్టీ వ్యవహారాలను ఎప్పటికిప్పుడు బలోపేతం చేసుకుంటేనే.. రాజకీయం చేయగలుగుతారు. అదేమి లేకుండా ఏదో ఎన్నికలు వస్తాయి.. పోటీ చేస్తాం.. జనం వేస్తే వేస్తారు.. లేకపోతే… లేదు అన్నట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది. చివరికి జనసేన పార్టీ కూడా… తన పార్టీకి లభించే ఆదరణపై.. ఓ అంచనాకు వచ్చేందుకు సమీక్షలు ప్రారంభించుకుంది.
వైసీపీలో ఇప్పటికీ… పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం అనే వ్యవస్థ లేదు. ఎవరి మాటలు వినేవాళ్లు కూడా లేరు. లోటస్ పాండ్ నుంచి వచ్చే సమాచారాన్ని.. పార్టీ నేతలు.. పాటించడం అనే వన్ వే మాత్రమే ఉంది. తప్పనిసరిగా మీటింగ్ పెట్టాల్సి వస్తే.. నిర్ణయాలు మాత్రం ముందే జరిగిపోయి ఉంటాయి. దానికి…అసెంబ్లీకి డుమ్మా కొట్టాలనే నిర్ణయమే సాక్ష్యం. ముందే నిర్ణయం తీసుకుని ప్రకటించేసిన తర్వాత … అది అందరి అనుమతితో తీసుకున్నామని చెప్పడానికి… ఎమ్మెల్యేల సమావేశం పెట్టారు. ఇప్పుడు.. పోలింగ్ ముగిసిన తర్వాత ఇంకేమి చేయడానికి ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే కనీసం ఆ పార్టీ అభ్యర్థులను పలకరించేవారు కూడా లేరు. ఎలాంటి సమీక్షలు లేవు.