2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. సాక్షి తో సహా చానల్స్ అన్నీ కూడా మొదట్లో ఇది సహజమైన మరణం అని ప్రకటించడం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ముందు సహజ మరణం అన్నట్టుగానే మాట్లాడడం, తర్వాత కొద్ది గంటలకి ఇది దారుణమైన హత్య గా పోలీసులు తేల్చడం, దాంతో వైఎస్ఆర్సిపి నేతలు కూడా ఇది హత్యేనని, దీన్ని చేసింది తెలుగుదేశం పార్టీ నేతలని వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే, అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించినట్లుగా నిజంగానే ఇది తెలుగుదేశం పార్టీ పని అయి ఉంటే, జగన్ అధికారంలోకి రాగానే ఈ కేసు చిక్కుముడి వీడుతుంది అని భావించిన ప్రజలకు దాదాపు వంద రోజులైనా ఆ హత్య కేసు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే ఇంతలో ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న శ్రీనివాస రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. పోలీసులు తనను వేధిస్తున్న కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీంతో ప్రతిపక్షం అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద విమర్శల తీవ్రత పెంచింది. తెలుగుదేశం పార్టీ నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఈ కేసులో నిజానిజాలు బయటపడాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలిసిందిగా ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసే సంస్కృతి వైఎస్ఆర్ సీపీ నేతల దేనని, అసలు నిందితులను రక్షించడానికి శ్రీనివాస రెడ్డి లాంటి వారిని పోలీసులు వేధించడం తోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా, ప్రజాధనంతో చంద్రబాబు హయాంలో నిర్మించిన తాత్కాలిక భవనాలను సైతం కూల్చివేసిన జగన్ ప్రభుత్వం, నిజంగా తెలుగుదేశం పార్టీ నేతల హస్తం గనక ఈ కేసులో ఉండి ఉన్నట్లయితే, ఈ వంద రోజుల కాలంలో కచ్చితంగా వారి మీద బలంగా కేసులు నమోదు చేసి ఉండేవారని, దాదాపు వంద రోజులు అయినా ఇప్పటి వరకు ఆ దిశగా కేసులు నమోదు కాలేదంటే, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఇందులో ఉండకపోవచ్చని, మరి ఇంకేదో కారణాలు ఉన్న కారణంగానే కేసులోని నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుందని ప్రజల్లో కూడా ఒక భావన ఏర్పడింది.
మరి తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేసినట్లుగా వైకాపా ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందా, ఈ కేసులోని నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయా అన్నది వేచి చూడాలి.