వైఎస్సాఆర్ పార్టీ నుంచి వరుసగా వలసలు కొనసాగడానికి బలమైన కారణాలే వున్నాయి. జగన్ ఏకపక్ష పని విధానం నచ్చకనే వెళ్లిపోతున్నారనేది సాధారణంగా వినిపించే మాట. అలా చాలామంది వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడకపోవడం, మమ్ముల్ను చూసే ఓటేస్తారన్నట్టు చెప్పడం అందరూ చూస్తున్నదే. ఇందులో ముఖ్యమైన వారికి తెలుగుదేశం ఒకింత సొమ్ము ముట్టజెప్పడం, భవిష్యత్తులో ఆ నేతలకు వారి వర్గానికి పదవులు అవకాశాలు కల్పించడం వంటివి కూడా నిజమే. పేమెంటు అగ్రిమెంటు కమిట్మెంటు అని దీన్ని నేను వర్ణించాను. అయితే దాంతోపాటు రాజకీయ పరిస్థితిలో వచ్చిన మార్పు కూడా ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నది.2014 ఎన్నికలకు ముందు జగన్ విజయం గురించి బలమైన అంచనాలే వుండేవి. చంద్రబాబు నాయుడు కూడా ఈ సారి గెలవకపోతే పార్టీని కాపాడుకోలేమన్న ఆందోళనతో అహౌరాత్రాలు పనిచేశారు. విమర్శలున్నా బిజెపితో చేతులు కలిపి అప్పుడు మోడీపట్ల వున్న ఆకర్షణను కూడా ఉపయోగించుకున్నారు. మొత్తానికి మూడవసారి ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ముఖ్యమంత్రి కావడం తప్ప మరో వూహనే దగ్గరకు రానివ్వని జగన్ ఈ తీర్పు తర్వాత తమ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి సమయం తీసుకున్నారు. తెలుగుదేశం పొరబాట్లు చేసినా చాలా నిర్ణయాలపై అసంతృప్తి వున్నా వాటివల్ల వైసీపీ ప్రయోజనం పొందకుండా చంద్రబాబు చాలా పకడ్బందీగా వ్యూహం నడిపించారు. అంతేగాక నియోజకవర్గాల్లో అన్నీ తెలుగుదేశం కనుసన్నల్లో నడిచేలా అధికారికంగానే ఏర్పాటు చేశారు. దీంతో గెలిచిన వైసీపీ ఎంఎల్ఎలు కూడా ఏమీ చేయలేని చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది.జగన్ వరకూ ఖర్చులకోసం సహాయం చేయడం మొదటినుంచి లేదు.దాంతో తమ అనుయాయులను నిలబెట్టుకోవడం కూడా వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. వారిలో చాలా మంది కొత్తవాళ్లు, ఎస్సి ఎస్టిలు కావడంతో బలీయమైన పాలక పక్షాన్ని తట్టుకోవడం సమస్యగానే మారింది. మరో నాలుగేళ్లవరకూ ఏ ఎన్నికలు లేవు కూడా. అప్పటి వరకూ వున్నా జగన్ తర్వాత కూడా తమకే టికెట్ ఇస్తారన్న హామీ లేదు. సభలోనూ ఆయన తమకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పాలకపక్షంలోకి దూకి రాజకీయ మనుగడ నిలుపుకోవాలన్న ఆలోచన వైసీపీలో బాగా పాకింది. అలాటి వారందరితో తెలుగుదేశం నాయకులు ‘టచ్’లో వుండి తగు సమయం చూసి తీసుకోవడం మొదలెట్టారు. పాలక పక్ష ఎంఎల్ఎలూ తనతో టచ్లో వున్నారని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తగినంత మంది వస్తే మీడియాకు చెబుతానని వ్యాఖ్యానించిన జగన్ తన వారినే నిలబెట్టుకోలేకపోయారు. గత కొద్ది రోజుల్లోనూ పదిమందికి పైగా వైసీపీ ఎంఎల్ఎలతో మాట్లాడితే జగన్ చేసేదే కరెక్టు అని గట్టిగా అన్నవారెవరూ లేరు. టిడిపి మాజీ ఎంపి ఒకరు మా సమక్షంలోనే వైసీపీ ముఖ్య నేతను ఆహ్వానించారు. ఆయన మాత్రం తనకు టికెట్ ఇచ్చిన జగన్ను వదలి వెళ్లనని చెప్పారు. అదే సమయంలో మీరు విమర్శనాత్మకంగా మాట్లాడాల్సిందే సార్ అంటూ నాతో అన్నారు. మంత్రి పదవి తలుపు తడుతున్నట్టు చెప్పే ఒక వైసీపీ ఎంఎల్ఎ కూడా ఆ కథనాలను ఖండించలేదు. కనుక ఆ పార్టీలో అసంతృప్తి యథార్థం. ఇంత మందిని తీసుకోవడంపై తెలుగుదేశంలోనూ కొంత అసంతృప్తి వుంది గాని ప్రతిపక్షం బలహీనపడితే మంచిదేనని సరిపెట్టుకుంటున్నారు. కేంద్రం అసెంబ్లీ సీట్లు పెంచితే అవకాశం వస్తుందని చాలామంది ఆశపెట్టుకుని వున్నారు. ఏది ఏమైనా జ్యోతుల నెహ్రూ బృందమే గాక మరో అరడజను మంది వైసీపీ ఎంఎల్ఎలు గోడ దూకే అవకాశం వుంది. వారిని అపగల శక్తి జగన్కు లేదు. బలహీనత కనిపిస్తున్న కొద్ది వెళ్లేవారి సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.