ముద్రగడ పద్మనాభం మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారని ప్రచారం ప్రారంభం కాగానే .. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతను సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. అయితే అభ్యర్థిత్వం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆమె చెబుతున్నారు. కానీ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే వైసీపీ తరపున ముద్రగడే పోటీ చేస్తారని .. వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతన్నాయి.
నిజానికి ముద్రగడ పద్మనాభం గతంలో వైసీపీలో చేరాలనుకున్నారు. చాలా కాలంగా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చి ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినా ముద్రగడ పెద్దగా మాట్లాడలేదు. జనవరి ఒకటో తేదీన ఆయన స్వగ్రామంలో సమావేశం పెట్టి వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించాలని అనుకున్నారు. మద్రగడ లేదా ఆయన కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్దమయిందని చెప్పుకున్నారు.
కానీ తర్వాత ఆయనకు ఎలాంటి సమాచారం రాలేదు. తాడేపల్లికి వెళ్లి హోటల్లో నాలుగు రోజులు పిలుస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నా పిలుపు రాలేదు. వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టీడీపీ లేదా జనసేనలో చేరుతానని ప్రకటించారు. ఆ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందులేదు. అయితే ఇప్పుడు పవన్ పై నిలబెట్టడానికి ఆయన సరిపోతారని వైసీపీ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మామూలు అభ్యర్థులపై పోటీకే అయన పనికి రారనని అనుకుంటే.. ప వన్ పై ఎలా సరిపోతారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇదోరకమైన మైండ్ గేమ్ అని భావిస్తున్నారు.