వైసీపీని ఓడిస్తానని పవన్ కల్యాణ్ పట్టుదలగా చెబుతున్నారు. ఆయన ఈ ఒక్క మాటే చెప్పడం లేదు. విధానపరంగా ప్రభుత్వ చేతకాని తనాన్ని మొత్తాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి.. శాంతిభద్రతలు దిగజారడం .. ప్రతిపక్ష నేతలపై దాడులు.. ప్రైవేటు ఆస్తుల కబ్జాలు… ఇలా అన్నింటినీ ప్రశ్నిస్తున్నారు.కానీ పవన్ ప్రశ్నించినా.. వ్యక్తిగత దూషణలే తమ ఆయుధం అన్నట్లుగా కాపు మంత్రుల్ని రంగంలోకి దింపుతున్నారు. సత్తెనపల్లిలో కూడా పవన్ మీటింగ్ అయిపోగానే అంబటి రాంబాబును రంగంలోకి దించి.. వ్యక్తిగత దూషణలకు పాల్పడేలా చేశారు.
అయితే పవన్ కల్యాణ్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని స్పష్టంగా తెలుస్తున్నందున ఈ సారి సజ్జల కూడా తెరపైకి వచ్చి నీతి వాక్యాలు చెప్పారు. పవన్ సీరియస్ పొలిటీషియన్ అయితే రాష్ట్రంలో సమస్యలు తెలుసుకోవాలి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని సమస్య పరిష్కరించేలా ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని… జగన్ అందరికీ మంచి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీని ఓడించాలంటే.. వృద్ధులు, మహిళలే ఓడించాలని.. వారికి పెద్ద ఎత్తున నగదు బదిలీ చేస్తున్నామన్నారు. 62 లక్షల మందికిపైగా పింఛన్… కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రూ.26 వేల కోట్లు చెల్లించామన్నారు. కానీ అవి పంచడానికి ప్రజలపై వేసిన భారం..చేసిన అప్పులు.. గురించి మాత్రం సజ్జల మాట్లాడరు.
పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే రాజకీయంగా స్పందిస్తారు. మిగతా వారందర్నీ వారి వారి కులంలో శత్రువులుగా చూసేలాగా చూస్తారు. కానీ తాను మాత్రం పద్దతిగా స్పందిస్తారు. ఈ వ్యవహారాన్ని కాపు మంత్రులు కూడా బాగానే అర్థం చేసుకున్నారు. కానీ కాదంటే తర్వాతి రోజు పదవి ఉండదు. అందుకే.. పదవే ముఖ్యమనుకుని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారు.