తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా చిన్న విమర్శ చేసినా దానిమీద తీవ్రస్థాయిలో విరుచుకు పడే వైఎస్ఆర్ సీపీ నేతలు బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శల మీద నోరు మెదపకపోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రతిపక్షమైన తెలుగుదేశం చేసే ప్రతి విమర్శ ను తిప్పికొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీలో చేసే విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీలోనే వారికి మించిన తీవ్ర పదజాలంతో తిప్పి కొడతారు. సోషల్ మీడియాలో లోకేష్ వంటి వారు చేసే విమర్శలకు విజయసాయి రెడ్డి వంటి నేతలు అదే సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తారు. తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసే వ్యాసాల మీద సాక్షిలో మరునాటికల్లా కౌంటర్ వ్యాసాలు వెలువడతాయి. కానీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ ఇటీవల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సిపి కి అధికారం రావడం తో తెలుగు ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. తమ అధినేత ని రామ్ మాధవ్ అంతలేసి మాటలంటే, ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడైనా నోరు మీద పోతాడేమో అని చూస్తే, ఒక్కరంటే ఒక్కరు కూడా రామ్ మాధవ్ ని గట్టిగా విమర్శించే లేకపోయారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశం హయాంలో కంటే వైఎస్ఆర్సిపి హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయని నేరుగా వైఎస్సార్సీపీని ఎక్కుపెట్టి విమర్శిస్తే, వైఎస్ఆర్ సిపి నేతలు కిమ్మనకుండా కూర్చుండిపోయారు. ఇక మరొక బీజేపీ నేత పురంధరేశ్వరి అయితే ప్రత్యేక హోదా పేరు పలికితే చంద్రబాబు కు పట్టిన గతే జగన్ కి కూడా పడుతుందని తీవ్ర విమర్శలు చేస్తే అటు జగన్ కానీ ఇటు ఆయన పార్టీ నాయకులు గానీ పురందరేశ్వరి మీద పల్లెత్తు మాట మాట్లాడలేక పోతున్నారు.
అయితే ప్రజలలో కూడా జగన్ మీద ఉన్న అవినీతి మరియు అక్రమాస్తుల కేసుల దృష్ట్యా, జగన్ గల్లీ స్థాయి బీజేపీ నేతల మీద కూడా విమర్శలు చేసే అవకాశం లేదు అన్న అభిప్రాయం బలపడిపోయింది. ఇక రామ్ మాధవ్ స్థాయి నాయకుల మీద విమర్శలు చేయడం అటుంచి కనీసం వారి విమర్శలకు ప్రతిస్పందించినా కూడా జగన్ మీద కాంగ్రెస్ హయాంలో నమోదైన కేసులలో పురోగతి కలుగుతుందన్న భావం ఏర్పడింది. మరి ప్రజల్లో ఉన్న ఈ భావాన్ని తొలగించే రీతి లో వైఎస్ఆర్ సీపీ నేతలు బీజేపీ విమర్శలని దీటుగా తిప్పికొడతారా అన్నది వేచి చూడాలి.