తెలంగాణలో ఎలాంటి ఫలితం వస్తుందోనని… అక్కడి పార్టీలు మాత్రమే కాదు.. ఏపీలోని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీపీ తెచ్చేసుకుంటోంది. ఎలాగైనా… టీఆర్ఎస్.. తెలగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. అంతర్గతంగా.. తమ పార్టీకి అంతో ఇంతో మిగిలి ఉన్న క్యాడర్‌కు కానీ.. ఇతర సానుభూతి వర్గాలకు కానీ.. టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలనే సందేశం పంపుతున్నారు. కానీ బహిరంగంగా మాత్రమే చెప్పుకోవడం లేదు. దీనికి ఏపీలో ప్రజల సెంటిమెంట్ అడ్డు వస్తుంది. లేకపోతే.. బహిరంగంగానే ప్రకటించి ఉండేవారు. టీఆర్ఎస్ గెలవాలని… వైసీపీ ఎందుకంత తాపత్రయ పడుతోంది..?. వైఎస్‌ను ఎప్పుడూ.. టీఆర్ఎస్ పొగడలేదు. ఇప్పటికీ.. వైఎస్‌ను ఓ దోపిడీ దారుడిగానే.. టీఆర్ఎస్ చెబుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. వైఎస్‌ను నీళ్లదొంగగా.. దుర్మార్గుడిగా చెబుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలోనూ పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీ .. టీఆర్ఎస్కే ఫేవర్‌గా ఉండటానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది.
దీనికి కారణంగా.. టీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ కన్నా… చంద్రబాబు మీద ఉన్న ద్వేషం అనుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకడుగు వేసింది వైసీపీ. కానీ చంద్రబాబు మాత్రం.. తన మార్క్ రాజకీయాలను చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లేదనుకున్న పార్టీని యాక్టివ్ చేశారు. ప్రజాకూటమికి అంతా తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా.. ఆయనపై ఏపీలో ఓ రకమైన క్రేజ్ వచ్చి పడింది. ఎప్పుడూ ఆంధ్రను తిట్టి.. తిరుగులేదనుకున్న కేసీఆర్‌ను ఓటమి అంచుల వరకూ తీసుకొచ్చారని… చెప్పుకుంటున్నారు. నిజంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోతే.. చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. పోటీ చేయడానికి కూడా భయపడిన జగన్, ధైర్యంగా పోరాడి.. టీఆర్ఎస్ను ఓడించారని పేరు తెచ్చుకునే చంద్రబాబు మధ్య… చాలా తేడా ఉంటుంది. అదే జరిగితే.. ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పట్టడం సాధ్యం కాదు.
ఈ పరిణామాలన్నింటినీ ఊహించుకునే.. టీడీపీ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కాకూడదన్న ఉద్దేశంతో.. కేసీఆర్ గెలవాలని… వైసీపీ ఆకాంక్షిస్తోంది. తన వంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో… బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదు కానీ.. మిగతా అన్ని పనులు చేస్తోంది. ఖమ్మం జిల్లా, గ్రేటర్లో మిగిలి ఉన్న వైసీపీ నేతలు ఇప్పటికే.. టీఆర్ఎస్కు అసోసియేట్ అయిపోయారు. కొన్ని కొన్ని ర్యాలీల్లో జెండాలు కూడా పెట్టి ప్రచారం చేసేస్తున్నారు. ఓ రకంగా.. వైసీపీ.. తెలంగాణ ఎన్నికలు చాలా పెద్ద చిక్కులు తెచ్చి పెట్టాయి. ప్రజాకూటమి గెలిస్తే.. చంద్రబాబు గెలిచినట్లేనని… టీఆర్ఎస్ ఓడిపోతే.. తన ఓటమేనని.. జగన్ భయపడిపోతున్నారు. అందుకే… ప్రత్యేకంగా కారణాలు లేకపోయినా.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వస్తోందనేది.. వైసీపీ నేతల అభిప్రాయం.