జీవితమనే ప్రయాణంలో పెళ్లి అనే గమ్యంపై అవగాహన లేని యువకుడు.. నేరం చేయడంలో మాత్రం రాటుదేలిపోయాడు. పెద్దల ముందు అంగీకరించి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికే అతను ప్రేమలో ఉన్నాడు. ఆ విషయమేచెప్పి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ చెప్పలేదు. పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమికురాలికి న్యాయం చేయడానికి భార్యను చంపేశాడు. అందు కోసం క్రిమినల్ బుర్రనంతా ఉపయోగించాడు. కానీ ఎంత ప్రొఫెషనల్ కిల్లర్ అయినా ఎక్కడో చోట దొరికిపోతాడు. అలా ఆ హంతకుడయిన భర్త దొరికిపోయాడు. కానీ విషాదం ఏమిటంటే… ఈ ఎపిసోడ్లో తన పరువు పోతుందని ఆ లవర్ కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన నవ్యారెడ్డి అనే యువతి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఇటీవలే బంధువు అయిన నాగశేషురెడ్డిని పెళ్లి చేసుకున్న నవ్యారెడ్డి హఠాత్తుగా రైలు కింద పడి చనిపోయింది. ఆమె ఫోన్ నుంచి తండ్రికి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మెసెజ్ వచ్చింది. కానీ పోలీసులు తీగ లాగితే… అంతా భర్త నాగశేషు రెడ్డి చేశాడని తేలింది. చంపేసి.. రైలు పట్టాల మీద వేసి .. తన భార్య ఫోన్ నుంచే మెసెజ్ చేసి ఇంటికెళ్లిపోయాడు. అయితే అలా తీసుకెళ్తున్నసమయంలో ఓ చోట సీసీ కెమెరాలో చిక్కాడు . దాంతో పోలీసులు పట్టుకున్నారు.
పోలీస్ ట్రీట్మెంట్ ప్రకారం నాలుగు తగిలించేసరికి.. భార్యను తానే చంపానని ఒప్పుకున్నాడు. ఎందుకు చంపాల్సి వచ్చిందంటే..అప్పుడు ప్రేమ విషయం చెప్పాడు. ఇది సంచలనం అయింది. ఇంతకూ నాగశేషు లవర్ ఎవరా అన్న చర్చ ప్రారంభమయింది. ఎవరో బయటకు రాలేదు. తానీ… అదే ఊళ్లో వెనీలా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అందరి దృష్టి అటు వైపు పడింది. నాగశేషురెడ్డి లవర్ ఆమెనని తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో.. పోలీసులు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుందని ప్రచారం గుప్పుమంది.
కారణం ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకోలేక… చేయి దాటిపోయిన తర్వాత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు నాగశేషు రెడ్డి.ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు వెలుగు చూస్తాయో..?