అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మళ్లీ రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రేసులో నిలిచే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ప్రెసిడెంట్ రేసులో తాము ఉంటామని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా డెమోక్రట్ల నుంచి దాదాపు 40 మంది ఈ రేసులో కనిపిస్తోన్నారు. అటు 2016లో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో నిలిచిన ట్రంప్.. అధ్యక్షుడిగా ఇప్పటికే మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. రెండో సారి అధ్యక్షుడవ్వాలని తహతహలాడుతున్నారు.
రెండో సారి అమెరికా అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ రెడీ..!
ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పాలసీలపై అనేక విమర్శలు ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచే కాదు.. దేశీయంగా కూడా ట్రంప్ విమర్శలు వచ్చాయి. అందుకే మరోసారి ప్రెసిడెంట్ రేసులో నిలబెట్టేందుకు కొందరు నేతలు ససేమిరా అంటున్నా.. ట్రంప్ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. మూడేళ్లలో చాలా చేశా..! ఇంకో నాలుగేళ్లు అవకాశం ఇస్తే అదరగొడుతా అంటున్నారు ట్రంప్..! తన హయాంలో అమెరికాలో ఎకానమీ పరిస్థితి మారిందని చెబుతున్నారు. ఇంటా, బయట హీట్ పెంచే కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. సొంత పార్టీలో తనకు ఎదురొచ్చే నాయకులనే కాదు.. డెమోక్రాట్లపైనా విరుచుకుపడుతున్నారు. 2020పై ఆశలు పెట్టుకున్న ట్రంప్‌కి… సొంత పార్టీ నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయ్. రిపబ్లికన్ పార్టీలోనే కొందరు ప్రెసిడెంట్ రేసులో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విలియమ్ ఎఫ్ వెల్డ్ ప్రెసిడెంట్ ఎన్నికల క్యాంపెయిన్‌కి సిద్ధమవుతున్నారు.మసాచుసెట్స్ మాజీ గవర్నర్ అయిన వెల్డ్… ట్రంప్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సారి రిపబ్లికన్లు మెరుగైన వ్యక్తిని ఎంచుకుంటారని అన్నారు వెల్డ్. ఇక ఓహియో మాజీ గవర్నర్ జాన్ కాసిచ్ కూడా ప్రెసిడెంట్ రేసులో ఉన్నానంటున్నారు. ట్రంప్ పేరు చెబితేనే భగ్గుమనే ఈయన..ఇప్పటికే రెండు సార్లు ప్రెసిడెంట్ రేసులో నిలిచి తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీలోనే ఇద్దరు ప్రముఖులు ట్రంప్‌కు సవాల్ విసురుతున్నారు.
డెమెక్రట్లపై తిట్ల దండంకం అప్పుడే షురూ..!
ఇక డెమోక్రట్ల సంఖ్య భారీగానే ఉంది. అయితే ఇందులో జోసెఫ్ ఆర్ బిడెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఈయన ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే…ట్రంప్ తన మాటల దాడి పెంచారు. బిడెన్ ఓ బలహీన ఆలోచన గల నాయకుడంటూ విమర్శించారు. బిడెన్ రేసులో ఉంటే ఆయన్ను డిబెట్లలో ఈజీగా కంగుతినిపిస్తానని చెబుతున్నారు. అంతేకాదు… డెమోక్రట్లు, విద్వేషకారులు, వారితో అమెరికాకు చాలా ప్రమాదకమంటూ మండిపడ్డారు.అంతేకాదు..బిడెన్ ఓ డమ్మీ అంటూ తిట్టిపోస్తున్నారు. డెమోక్రటిక్ నేత బిడెన్ ఒకటి అంటే… ట్రంప్ నాలుగు అంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల తిట్ల దండకం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాను ప్రపంచదేశాలకు శతృవు చేసిన ట్రంప్..!
2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని..! అయితే ఈ నినాదం వెనుక ఎన్నో దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అమెరికాను మళ్లీ గ్రేట్ చేస్తానన్న ట్రంప్… ఆర్థిక, వాణిజ్యం పరంగా ప్రపంచ దేశాలతో కయ్యాలు పెట్టుకున్నారు. వాళ్లను తరిమేస్తామంటూ, గోడలు కట్టేస్తామంటూ హీట్ పెంచి.. ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో…హడలెత్తించారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు.. దాని మిత్ర దేశాలపైనే తీవ్ర ప్రభావం చూపించారు. ఇలా ట్రంప్‌కు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు లేదు. గత ఎన్నికల్లో వాడిన అస్త్రాన్నే మళ్లీ ఉపయోగిస్తున్నారు ట్రంప్..! ఇప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ పాలసీ.. వాణిజ్య యుద్ధాలపై గళం విప్పుతున్నారు. దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే చైనా ట్రెడ్ వార్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. చైనా వస్తువులపై సుంకాలు పెంచడంతో..పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఆర్థికంగా చైనాను దెబ్బకొట్టేందుకు వాణిజ్యాన్ని ఉపయోగిస్తున్నారు. అందరూ అమెరికా మీద పడి అప్పనంగా బతికేస్తున్నారంటూ ఇతర దేశాలపైనా.. ట్రంప్ నోరు పారేసుకుంటున్నారు. ఇరాన్ ఉగ్ర దేశమంటూ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అంతేకాదు…ఇరాన్ ఆయిల్ దిగుమతి దారులపై ఆంక్షలు విధించింది.
అయినా అమెరికన్లకు ట్రంపే ఇష్టుడా..?
మిత్ర దేశాలపై కత్తి దూస్తున్నారు ట్రంప్. భారత్ తమకు మిత్రదేశమంటూనే… సాధారణ ప్రాధాన్యత దేశాల నుంచి భారత్‌ను తప్పించింది. ఇండియా తమ వస్తువులపై వంద శాతం సుంకాలు విధిస్తోందని.. అలాంటప్పుడు తామెందుకు భారత వస్తువులపై సుంకాలు విధించొద్దని వాదిస్తున్నారు. ఈ ఇలాంటి చర్యలు, చేష్టలు, వ్యాఖ్యలు ఆయన పరపతిని దిగజార్చాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీ అంటూ తల్లులను, పిల్లను వేరు చేస్తూ షెల్టర్లలో ఉంచడం విమర్శలకు తావిచ్చింది. ఇలా ఒక్కటి రెండు కాదు..! అనేక నిర్ణయాలు విమర్శలకు తావిచ్చాయి. మెక్సికో నుంచి వలసదారులు అక్రమంగా అమెరికాకు వస్తున్నారంటూ ట్రంప్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. మెక్సికో బోర్డర్లో గోడ కట్టేస్తానంటూ చెప్పారు కూడా. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అయితే గోడ కట్టేందుకు నిధులు విడుదల చేసేందుకు డెమోక్రాట్లు ససేమిరా అన్నారు. గోడ కట్టేందుకు అసరమైన నిధుల కోసం ట్రంప్ రెండుసార్లు అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెడరల్ ఉద్యోగులు జీతాల్లేక విలవిల్లాడారు. అయినా ట్రంప్ తన మొండిపట్టు వీడలేదు. మరి ఈ ట్రంపరితనాన్ని అమెరికా రెండో సారి కోరుకుంటుందా..?