తెలుగు360 రేటింగ్ : 2.75/5
ఉగ్రవాద నేపథ్యంలో సాగే కథలు, టెర్రరిస్టుల అన్వేషణ, దేశభక్తి కథలు.. ఇవన్నీ మంచి కమర్షియల్ అంశాలే. కనెక్ట్ అయితే… ఎక్కడో ఉంటాయి. బాలీవుడ్ లో వచ్చిన బేబీ నుంచి ఉరి వరకూ… ఇదే ఫార్ములా. వెబ్ సిరీస్‌లలో ఈ తరహా కథలు ఇంకొంచెం ఎక్కువ వస్తున్నాయి. `ఫ్యామిలీ మేన్` శిఖరాగ్రాన నిలుస్తుంది. అలాంటి కథలు, సినిమాలు చూసినప్పుడల్లా.. మనకూ ఇలాంటి సినిమాలొస్తే బాగుణ్ఱు అనిపిస్తుంటుంది. బహుశా.. `వైల్డ్ డాగ్` అనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి అదే ప్రేరణ కావొచ్చు. లాక్ డౌన్ సమయంలో.. నెట్‌ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఓటీటీలోకి విడుదల చేసేద్దామనుకున్నారు. చివరి క్షణాల్లో… థియేటరికల్ రిలీజ్ కి తీసుకొచ్చారు. మరి.. `వైల్డ్ డాగ్` ఎలా ఉంది? ముందు చెప్పుకున్న ఉరి, బేబీ లాంటి సినిమాల స్థాయిలో నిలిచిందా?
కథ చాలా సింపుల్. ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో నాగార్జున చెప్పేసిందే. ట్రైలర్లు చూసినా కథ తెలిసిపోతోంది. పూణెలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దానికి కారణం.. ఖాలీద్ అనే ఉగ్రవాది. తనని పట్టుకోవడానికి ఎన్.ఐ.ఏ విజయ్ వర్మ అనే అధికారిని నియమిస్తుంది. తన టీమ్ తో చేసిన ఆపరేషనే.. `వైల్డ్ డాగ్`. ఖలీద్ ముంబై మకాం మారుస్తాడు. వైల్డ్ డాగ్ టీమ్… ముంబై వెళ్లి, ఓ వల పన్నినా చివరి క్షణాల్లో ఖాలీద్ మిస్ అవుతాడు. అక్కడ్నుంచి నేపాల్ పారిపోతాడు. ఖాలీద్ ని పట్టుకోవడానికి ఈ టీమ్ అనధికారికంగా నేపాల్ వెళ్తుంది. మరి నేపాల్ లో అయినా ఈ ఆపరేషన్ ఫలించిందా, లేదా? ఖాలీద్ ని ప్రాణాలతో ఇండియా ఎలా తీసుకురాగలిగారు? అనేదే మిగిలిన కథ.
ఈ జోనర్లో నడిచే సినిమాలకు ఇంతకంటే పెద్ద కథలు అవసరం లేదు. టెర్రరిస్ట్‌ని పట్టుకోవడం మినహా… మరో ఫ్లాట్ కూడా అవసరం లేదు. కాబట్టి కథ విషయంలో పెద్దగా లోటు పాట్లు వెదకాల్సిన పనిలేదు. `వైల్డ్ డాగ్`లో రెండు పాయింట్లు ఉన్నాయి. ఉగ్రదాడి ఎవరు చేశారో తెలుసుకోవడం, తనని పట్టుకోవడం. తెలుసుకోవడం.. ఇన్వెస్టిగేషన్ మెథడ్. సీసీ కెమెరాలు చూసి ఆ దాడి ఎవరు చేశారో తెలుసుకోవడం చప్పగా సాగింది. నిజానికి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం థ్రిల్లింగ్ గా రాసుకోవాల్సింది. ఆ తరవాత ఖాలీద్ ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే కీలకం. ముంబైలో స్కెచ్ వేసి ఖాలీద్ ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, ఖాలీద్ తెలివిగా అక్కడ్నుంచి తప్పుకోవడం ఆకట్టుకుంటుంది. నిజానికి అక్కడే ఇంట్రవెల్ కార్డ్ వేస్తే బాగుండేది.
సెకండాఫ్ లో కథ నేపాల్ కి షిఫ్ట్ అవుతుంది. నేపాల్ వెళ్లగానే.. `వైల్డ్ డాగ్` టీమ్ మీద ఓ దాడి జరుగుతుంది. ఆ దాడి ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అని తెలుసుకోవడం మరో లేయర్ గా మారిపోయింది. నిజానికి అది ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఖలీద్ అనే ఓ భయంకరమైన ఉగ్రవాది ఎలాంటి సెక్యురిటీ లేకుండా, పెళ్లిళ్లకు వచ్చేస్తాడా? అదీ ఓ ఎం.పీ ఇంటికి..? అనేది లాజిక్ లేని విషయం. ఖాలీద్ ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, విఫలం అవ్వడం… దాదాపు సినిమా అంతా ఇలానే సాగుతుంది. చివర్లో ఖాలీద్ ని ప్రాణాలతో నేపాల్ నుంచి ఇండియాకి తీసుకురావాలి. ఇదే సినిమాకి ప్రధానమైన టాస్క్. ఇది `బేబీ` సినిమాలోని క్లైమాక్స్ ని గుర్తు తెచ్చే సీన్. ఓరకంగా… దర్శకుడు ఈ సీన్‌ని బాగానే డీల్ చేసినా `బేబీ` చూసినవాళ్లకు మాత్రం.. తేలిపోతుంది.
బేబీ, ఫ్యామిలీమెన్లలోనూ ఇదే టెర్రరిజం, ఇలాంటి అన్వేషణే ఉంటుంది. అయితే.. ఆ రెండు చోట్లా.. ప్రేక్షకుడ్ని ఎమోషనల్ గానూ కట్టిపడేశారు దర్శకులు. ఎక్కడా సహజత్వాన్ని కోల్పోకుండా ఆపరేషన్ జరుగుతుంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా, అది తప్పని పరిస్థితుల్లో మాత్రమే. `వైల్డ్ డాగ్`లో అవి మిస్సయ్యాయి. ఓ సందర్భంలో ఖాలీద్ దొరికితే ఎంత..? దొరక్కపోతే ఎంత? అనే స్థితికి ప్రేక్షకుడు వెళ్లిపోతాడు. అలాంటప్పుడు తెరపై ఎంత జోరుగా యాక్షన్ సీన్లు నడుస్తున్నా.. ఇంకెక్కడ కనెక్ట్ అవుతారు?
నాగార్జున సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. కాకపోతే.. ఇంకాస్త యాక్టీవ్ గా ఉండాల్సింది. `మీరు కానీయండి బాయ్స్..` ఫీట్లు తగ్గించేసి, ఆ పనిని తన టీమ్ కి అప్పగించేశాడు నాగ్. కొన్నిసార్లు (నేపాల్ ఎపిసోడ్స్)లో నాగ్ లీడ్ తీసుకోవాల్సివచ్చింది. సయామీఖేర్ మరీ సీరియస్‌గా కనిపించింది. `వైల్డ్ డాగ్` టీమ్ లో కాస్త గుర్తిండిపోయేది అలీ రాజానే.
టెక్నికల్ గా చూస్తే.. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తమంతా యాక్షన్ సీన్లే కాబట్టి.. అందులోని హీట్ ని ఆర్.ఆర్ ద్వారా పెంచే ప్రయత్నం చేశాడు తమన్. యాక్షన్ సీన్లలో తుపాకుల మోతే ఎక్కువ వినిపించింది. కెమెరాపనితనం కూడా ఆకట్టుకుంటుంది. సాల్మన్.. ఓ సీరియస్ యాక్షన్ సినిమా తీద్దామనుకున్నాడు. జోనర్ ని కూడా బలంగానే ఎంచుకున్నాడు. సన్నివేశాల్లో బిగి ఉండుంటే బాగుండేది. కొన్నిచోట్ల… వైల్డ్ డాగ్ ఓకే అనిపించినా, ఇంకొన్ని చోట్ల… ఇంకాస్త బాగా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది.
ఓటీటీలు వచ్చేశాక ఇలాంటి జోనర్ సినిమాలు చాలానే చూస్తున్నారు. వాళ్లందరికీ.. `వైల్డ్ డాగ్` అంత కొత్తగా కనిపించకపోవొచ్చు. రెగ్యులర్ సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి మాత్రం `వైల్డ్ డాగ్` కొంత మేర నచ్చుతుంది. పాటలూ, హీరోయిజం బిల్డప్పుల జోలికి వెళ్లకుండా ఉండడం, హెవీ డైలాగులు పెట్టకపోవడం, అవకాశం వచ్చింది కదా అని దేశ భక్తి గురించి లెక్చర్లు పీకకపోవడం.. కాస్త కలిసొచ్చే అంశాలు.
తెలుగు360 రేటింగ్ : 2.75/5