రోబో 2.0 కున్న హైప్ తనను తానే పాడు చేసుకుంటోంది చిత్రబృందం. రకరకాల రిలీజ్ డేట్లు ప్రకటించడం, వాయిదా పడడం పరిపాటి అయిపోయింది. `రోబో 2.0` ఎప్పుడు అంటే.. `ఎప్పుడొస్తే అప్పుడు` అన్నట్టు తయారైంది పరిస్థితి. స్వయంగా ఇదే మాట రజనీనో, శంకర్నో అడిగితే వాళ్లూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈమధ్య కాలంలో ఓ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడడం `రోబో` విషయంలోనే జరిగిందేమో. ఇప్పటికే పదులసార్లు విడుదల తేదీ వాయిదా పడింది. ఇక రోబో రావడం వచ్చే యేడాదే అనుకున్నారు. ఇప్పుడు శంకర్ మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించాడు. నవంబరు 29న ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పాడు. అంత క్లారిటీ ఏమిటి? అంటే… విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు నవంబరు నాటికి వర్క్ పూర్తి చేస్తాయని మాటిచ్చాయట. అందుకే శంకర్ రిలీజ్ డేట్ చెప్పే ధైర్యం చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన చిక్కే ఇది. చిన్న సన్నివేశానికి సైతం రోజుల తరబడి పని ఉంటుంది. భారీ ఎపిసోడ్లయితే ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. వీఎఫ్ఎక్స్ తో పెట్టుకుంటే.. ఇలానే ఉంటుంది. ఈ విషయంలో శంకర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వీఎఫ్ఎక్స్ ఈసారైనా చెప్పిన సమాయానికి పూర్తవుతాయా, లేదా? అనేది ఇంకా డౌటే. ఏ నమ్మకంతో శంకర్ రిలీజ్ డేట్ ప్రకటించాడో ఆయనకే తెలియాలి. ఈసారైనా చెప్పిన సమయానికి రోబోని సిద్ధం చేస్తే సరే సరి. లేదంటే… మరోసారి అభాసుపాలవ్వడం ఖాయం.