బీజేపీ జాతీయ అద్యక్షుడు నడ్డాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడంతో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మారిన రాజకీయ పరిణామాలతో ఈసారి సౌత్ కు ఛాన్స్ ఇస్తారా..? మరోసారి నార్త్ కు చెందిన నేతకే అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా..? అనే చర్చ జరుగుతోంది.
అయితే, ఈసారి బీజేపీకి నాయకత్వం వహించడం ఆషామాషీ కాదు. కేంద్రంలో టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాల సపోర్ట్ తో బీజేపీ అధికారంలో కొనసాగుతుండటంతో పార్టీ కొత్త చీఫ్ మిత్ర పక్షాలన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఎన్డీయే కూటమిని నడిపించాల్సి ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే కొత్త బాస్ కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి.
బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచిన యూపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయి. అక్కడ 80ఎంపీ సీట్లు ఉండగా బీజేపీ సారి 32 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరో మూడేళ్లలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దాంతో పార్టీ శ్రేణులపై ఈ ఎన్నికల ప్రభావం లేకుండా కొత్త బాస్ పార్టీకి కొత్త జవసత్వాలు అందించేలా ఉండాలనుకుంటున్నారు.
మరోవైపు, మహారాష్ట్రలోనూ ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో కొనసాగుతున్నా లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా రావడంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాల కోసం బీజేపీ చెమటోడ్చాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి కాగానే బీహార్ ఎన్నికలు రానున్నాయి. అక్కడ ఎన్డీయే కూటమికి అనుకూలంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇండియా కూటమి గట్టి పోటీనివ్వడంతో ఈ సవాళ్ళను ఈజీగా డీకొట్టుకుంటూ ముందుకు వెళ్లే లీడర్ కోసం బీజేపీ అన్వేషిస్తోంది.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు మోడీ కూడా అంగీకరించారని అందుకే ప్రస్తుత అద్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను కోల్పోతే బీజేపీకి దక్షణాది రాష్ట్రాలు అండగా నిలవడంతో సౌత్ కు చెందిన బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా…? అనే చర్చ బీజేపీలో జరుగుతోంది.