బిగ్ బాస్ విజేతలకు కాస్త పాపులారిటీ తప్ప, సినిమా రంగం నుంచి ఒరిగిందేం లేదు. తొలి సీజన్ లో విజేత గా నిలిచిన శివ బాలాజీకి ఆ తరవాత ఆఫర్లు గంపగుత్తగా వస్తాయనుకున్నారు. కానీ… శివ బాలాజీని ఎవరూ పట్టించుకోలేదు. రాహుల్ సిప్లిగంజ్, కౌశల్ పరిస్థితీ అంతే. కౌశల్ హీరోగా ఓ సినిమా మొదలై.. మధ్యలో ఆగిపోయింది కూడా. ఇక సినిమా రంగం నుంచి తనకు ఛాన్సులు రావని కౌశల్ కూడా ఫిక్సయిపోయి, తన సీరియల్స్ ఏవో తాను చేసుకుంటున్నాడు.
ఇప్పుడు అభిజిత్ పరిస్థితీ అంతేనా? లేదంటే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా? అనే ఆసక్తి నెలకొంది అందరిలో. ఇప్పటి వరకూ బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన వాళ్లలో… కాస్త యంగ్ అభిజిత్ నే. ఒకట్రెండు సినిమా ల్లో హీరోగానూ చేశాడు. బిగ్ బాస్ క్రేజ్ వల్ల ఇప్పుడు అతనికైనా సినిమాలు దొరుకుతాయా, లేదా? అనేది చూడాలి. అయితే ఇప్పటికే అభిజిత్ హీరోగా ఓసినిమా ఫిక్సయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. తనకు ఆఫర్లు వస్తున్నాయని, సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అభిజిత్. అయితే శివబాలాజీ, కౌశల్ టైమ్ లోనూ ఇలానే.. కాస్త హడావుడి కనిపించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఓ వారం పది రోజులు.. మీడియా అంతటా వాళ్లే కనిపించేవారు. అప్పుడే సినిమా ఆఫర్లు వచ్చాయి, ఇక మేం ఫుల్ బిజీ అన్నట్టు మాట్లాడేవారు. కానీ ఆ తరవాత… ఆ వేడి చప్పున చల్లారిపోయేది. ఇప్పుడు అభిజిత్ విషయంలోనూ ఇదే జరగొచ్చు. కాకపోతే.. ఈమధ్య కాలంలో ఓటీటీ ల హవా ఎక్కువైంది. వెబ్ సిరీస్‌లూ, వెబ్ మూవీస్ అంటూ.. అందరికీ పని దొరుకుతోంది. అభిజిత్ లాంటి వాళ్లకైతే.. ఓటీటీలలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ బిగ్ బాస్ ఫేమ్ ని అభిజిత్ అలాగైనా వాడుకుంటాడేమో చూడాలి.