సెకీ విద్యుత్ వ్యవహారంలో జగన్ రెడ్డికి లంచాలు ముట్టాయని అమెరికా కోర్టు వెల్లడించిన తర్వాత ఇండియాలోనూ విచారణ జరపాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ దీనిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే ఏపీలో మాత్రం సెకీ డీల్ పై పూర్తి స్థాయి విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏసీబీకి ఫిర్యాదు చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏసీబీ అధికారుల్ని కలిశారు. అదానీ డీల్ పై సమగ్ర సమాచారంతో ఫిర్యాదు చేశారు. బయట మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎందుకు విచారణ చేయదని ప్రశ్నించారు. నిందితులని జైల్లో పెట్టాలని ఓ పంజరాన్ని తీసుకు వచ్చి ప్రదర్శించారు కూడా.
ఇప్పటికే కొంత మంది అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కూడా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.కానీ ఇప్పటి వరకూ ఏసీబీ వైపు నుంచి కనీసం విచారణ చేస్తామన్న మాట కూడా రాలేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పకపోతే వారు కూడా ఏమీ చేయలేరు. అదానీతో డీల్ .. పెట్టుబడులకు సంబంధించిన మ్యాటర్ కావడంతో వీలైనంత ఎక్కువగా ఆధారాలు లభించిన తర్వాత ముందుకెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది.