ప్రధాని మోడీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదంటూ.. ఓ రిపబ్లిక్ డే రోజున బంద్‌కు పిలుపునిచ్చి.. విశాఖ తీరంలో తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు… ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్. అదే మోడీని ఆ తర్వాత పవన్ కల్యాణ్.. నానా మాటలన్నారు. ఆ తర్వాత రూటు మార్చారు. ఇతరులు విమర్శిస్తే… గౌరవంగా మోడీని సంబోధిచకపోతే తను ఫైరయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అదే నరేంద్రమోడీ… ఏపీకి వస్తున్నారు. ప్రత్యేకహోదా సహా … విభజన చట్టంలో ఏ ఒక్క అంశాన్ని కేంద్రం నెరవేర్చలేదు. ఇలాంటి సమయంలో… మోడీ ఏపీకి వస్తున్నారు. అచ్చంగా రాజకీయ పర్యటనకు వస్తున్నారు. మరి జగన్, పవన్‌లు ఏం చేయబోతున్నారు..?
మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నందున… ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు వ్యక్తం చేయాలని.. తెలుగుదేశం పార్టీతో పాటు… వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఇంత వరకూ తమ విధానాన్ని ప్రకటించలేదు. మోడీ పర్యటనను స్వాగతిస్తున్నారా.. అన్న విమర్శలు… టీడీపీ నుంచి గట్టిగానే వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీతో.. సన్నిహితంగా ఉంటున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు.. మోడీ పర్యటనను.. స్వాగతిస్తే.. అది మరింత బలపడుతుంది. ఒక వేళ స్వాగతించకపోయినా.. మౌనంగా ఉన్నా పెద్దగా తేడా ఉండదు. బీజేపీ, వైసీపీ, జనసేన ఒక్కటేనన్న నమ్మకం ప్రజల్లోకి వెళ్లిపోతుంది.
తమపై బీజేపీ ముద్ర ఉండకూడదంటే… వైసీపీ, జనసేనలు దూకుడుగా మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాల్సి ఉంటుంది. విభజన హామీల అమలు కోసం… మోడీపై ఒత్తిడి పెంచేందు.. ఆ పార్టీతో తమకు ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు లేవని నిరూపించుకునేందుకు ఇదో గొప్ప అవకాశంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. మోడీ పర్యటన ఖరారయిపోయింది.. రాజకీయ వేడి పెరుగుతోంది. కానీ.. వైసీపీ, జనసేనలు మాత్రం… సైలెంట్‌గా ఉంటున్నారు. తాము ఎలా వ్యవహరించాలన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇప్పుడు కాకపోతే.. మరో రెండు రోజులకైనా… స్పందించక తప్పదు. మరి అప్పుడైనా ఎలా కవర్ చేసుకుంటారో..?