ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలన్ మస్క్, టిమ్ కుక్‌లను కూడా పిలిచామని ఎప్పుడో ప్రకటించారు. వాళ్లనే పిలిచినందున ఇక దేశీ దిగ్గజాలను పిలవకుండా ఉంటారా..? పరిశ్రమల మంత్రి అమర్నాథ్ ఓ సారి ముంబై వెళ్లి పారిశ్రామికవేత్తల్ని పిలిచారు. తర్వాత ఆమర్నాథ్ తో వెళ్తే పని కాదనుకున్నారేమో కానీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్ షోలు… పారిశ్రామికవేత్తలతో భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్ని పెళ్లికి పిలిచినట్లుగా పిలుస్తున్నారు.
అయితే అదానీని కలిసి ఆహ్వానించారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే అదానీకి ఏపీకి ఇటీవలి కాలంలో విడదీయలేనంత బంధం ఏర్పడింది. గన్నవరం నుంచి కృష్ణపట్నం వరకూ పోర్టులు ఆయన సొంతం. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా కొనేద్దామనుకున్నారు కానీ ఎక్కడో తేడా పడింది. ఇంకా చాలా ప్రాసెస్ లో ఉన్నాయి. ఇటీవలే అత్యంత ఖరీదైన అరవై ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అంతకు ముందే మరో 160 ఎకరాలిచ్చింది. అక్కడ అసలు పనులే ప్రారంభించలేదు. అయినా సంతర్పణలు జరుగుతూనే ఉన్నాయి.
అధికారికంగా ఇప్పటి వరకూ అదానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఉన్న పోర్టుల్ని గీచి గీచి బేరమాడి కొనేశారు. ఇప్పుడు పెట్టుబడులు సదస్సు జరుగుతుంది కాబట్టి అదానీ గ్రూప్ వచ్చి .. ఓ లక్ష కోట్ల పెట్టుబడుల్ని ప్రకటిస్తుందనే ఆశాభావంతో వైసీపీ వర్గాలున్నాయి. అయితే ఇటీవల అదానీ సమస్యల్లో ఇరుక్కున్నారు . ఆయన సంపద అరవై శాతం కరిగిపోయింది. రుణాల చెల్లింపుల కోసం ఆయన డబ్బులు వెదుక్కుంటున్నారు. వ్యవస్థల మద్దతు ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మునిగిపోయేదన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ఆయన వచ్చి ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటిస్తే అందరూ… వింతగా చూస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం అలాంటి వింతలకే ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి.. ప్రకటించవచ్చని అనుకుంటున్నారు.