ఆంధ్రప్రదేశ్ తదుపరి చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసుకున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తర్వాత సీఎస్‌గా ఎవరు ఉంటారనేది.. అంతకు ముందు బదిలీల్లో ముఖ్యమంత్రులు సూచనలు పంపుతారు. చీఫ్ సెక్రటరీ తర్వాత అత్యంత కీలకమైన సీసీఎల్ఎ కమిషనర్‌గా.. కాబోయే చీఫ్ సెక్రటరీని నియమిస్తారు. నిన్నటి వరకూ సీసీఎల్ఏగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. ఆయనే సీఎస్ అవుతారని అనుకున్నారు. అనూహ్యంగా రాత్రికి రాత్రే నీరబ్ కుమార్ ప్రసాద్‌ను బదిలీ చేసేశారు. ఆయన వద్ద ఉన్న అన్ని శాఖల నుంచి రిలీవ్ చేసేశారు. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సిన్సియర్ అధికారిగా పేరుంది. ఆయనకు వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆయన మొత్తం క్షణ్ణంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. అయితే.. అది ప్రభుత్వ పెద్దలు అప్పటి వరకూ చెబుతూ వస్తున్న.. చేస్తున్న చేతలకు కాస్త భిన్నంగా ఉంది. దీంతో అప్పటి నుండే ఆయనపై అసంతృప్తి ప్రారంభమైందన్న చర్చ అధికారవర్గాల్లో ఉంది. సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. కరోనా కారణంగా రెండు విడుతలగా ఆమెకు పదవీ కాలం పొడిగింపును జగన్ ఇచ్చారు. ఇక నిబంధల ప్రకారం పొడిగింపు లభించకపోవచ్చని చెబుతున్నారు. ఏపీ సర్కార్ నుంచి అలాంటి ప్రతిపాదనేది కేంద్రం వైపు వెళ్లలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించారు. భారీ నీటి పారుదల శాఖలో ఆయన హవా ఉండేది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఆదిత్యనాథ్ దాస్‌కు అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నందునకోర్టు ఖర్చుల కోసం.. అప్పటి ప్రభుత్వం రూ.7.56 లక్షలు ఇచ్చింది. నిబంధనల ప్రకారంం.. న్యాయవాదుల నుంచి రసీదులు తీసుకుని ప్రభుత్వానికి ఆ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పలేదు. దీనిపైనా ఆయనపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితులగా ఉన్న వారికి పెద్ద ఎత్తున పదవులు లభిస్తున్నాయి. అధికారుల్లోనూ వారికే ప్రాధాన్యం లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.