పై ఫొటోలో ఉన్న సీన్ పాట్నాలో రిపీట్ అవుతుందా? ఫొటోలో ఉన్న సీన్ ఎప్పుడో ఢిల్లీలో తీసిన ఫైల్ ఫొటో. మరి, పాట్నాలో నితీష్ ప్రమాణ స్వీకారానికి అద్వానీ వెళ్తారా, వెళ్లరా?
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఐదో సారి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. పాట్నాలోని గాంధీ మైదాన్ సుందరంగా ముస్తాబైంది. రాజకీయ అతిరథ మహారథులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. వారిలో బీజేపీ అగ్రనేత అద్వానీ ఉంటారా లేదా అనేదే హాట్ టాపిక్.
తన ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని మోడీని నితీష్ కుమార్ ఆహ్వానించారట. అలాగే అద్వానీతో పాటు బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్న సిన్హాకు కూడా ఆహ్వానం పంపారు. మోడీకి నితీష్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని బీహార్ సీఎంవో వర్గాలు తెలిపాయి. అంతేకాదు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలకు సీఎంవో నుంచి ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్లాయి. కానీ మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆయన ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులు హాజరవుతారని జేడీయూ వర్గాలు చెప్తున్నాయి.
ఇంతకీ పెద్దాయన అద్వానీ ఏం చేస్తారు? మొన్ననే నితీష్ ప్రచార విభాగం సారథి ఢిల్లీలో అద్వానీని కలిశారు. ఆయనకు అద్వానీ అపాయింట్ మెంట్ ఇవ్వడం అంటే పాట్నాకు వస్తున్నానని సంకేతం ఇవ్వడమే అనే వదంతులు మొదలయ్యాయి. బీహార్లో ప్రచార బాధ్యతలు తీసుకున్న వారే ఓటమికి జవాబుదారీ కావాలని అద్వానీ తదితర సీనియర్ నేతలు ఇటీవల వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా పార్టీ పరిస్థితి దిగజారి పోతోందని ఆక్రోశించారు. మోడీ, అమిత్ షాల పేరు ప్రస్తావించకుండానే కడిగేశఆరు. కాబట్టి, మోడీకి షాకివ్వడానికి అద్వానీ పాట్నా వెళ్లవచ్చనే వదంతులు వినవస్తున్నాయి. అయితే, అద్వానీ అంతటి రాజకీయ పరిణతిగల నేత అలా చెయ్యరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ పాట్నాలో ఏం జరుగుతుందో చూద్దాం.