సీఎం రేవంత్ రెడ్డి… అన్నీ తానై పాలనను, పార్టీని నడుపుతున్నారు. అధికారంలోకి తీసుకొచ్చి, ఇటు ప్రభుత్వ బాధ్యతను అటు పార్టీ బాధ్యతను మోస్తున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఖాయమైనా, ఎవరు… అనేదే ఇంకా తేలలేదు.
అయితే, కొత్త అధ్యక్షుడు ఎవరైనా సీఎంకు జోడెద్దులా ఉండాలన్నది సీనియర్ల మాట. కానీ, కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు… కొట్లాటలు, ఆధిపత్య పోరు తెలిసిందే. అందుకే ఎవరికి వారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.
పీసీసీ ఎవరైతే బాగుంటుందో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన మనసులో మాట సోనియా, రాహుల్ కు చెప్పారు. కారణాలు కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. అదే సమయంలో ఉత్తమ్ తో పాటు భట్టి కూడా తమ మద్ధతుదారుల కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు.
ఒక్క పీసీసీ చీఫ్ మాత్రమే కాదు అదే సమయంలో క్యాబినెట్ విస్తరణ కూడా ఉండాలన్నది సీఎం ఆలోచన. అందులోనూ తనకు స్వేచ్ఛ కావాలని, కోదండరాం వంటి ఉద్యమ నేతలకు అవకాశం ఇస్తే… ప్రజల్లో సానుకూలత ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి పార్టీ పెద్దలు ఎంతవరకు ఒప్పుకుంటారు అన్నదే ఆసక్తికరంగా మారింది.
అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి… రేవంత్ పై పాజిటివ్ ఉంటే అనుకున్నట్లే ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. కానీ, కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే మాత్రం రేవంత్ కు పోటీగా పీసీసీ, కొత్త మంత్రుల ఎంపిక జరుగుతుంది.