అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్… ఇలా 5 సినిమాలు చేశాడు అఖిల్. ఇందులో ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్..’ జస్ట్ ఓకే అనిపించుకొంది అంతే. `ఏజెంట్` అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ అఖిల్ కెరీర్‌పై చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది. అందుకే కొన్నాళ్ల పాటు కొత్త కథలేం వినలేదు. ప్రాజెక్టులు ఓకే చేయలేదు. చాలా కథల్ని ఒడబోసి చివరికి ‘లెనిన్’ సినిమా ఓకే చేశాడు. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం `లెనిన్` గ్లింప్స్ కూడా విడుదలైంది.
అఖిల్ పై ముందు నుంచీ ఓ విమర్శ వుంది. తన ఇమేజ్ కంటే పెద్ద కథల్ని ఎంచుకొంటున్నాడని, అందుకే ఫ్లాపులు ఎదుర్కొన్నాడన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. తొలి సినిమా ‘అఖిల్’తోనే ప్రపంచాన్ని రక్షించేంత పెద్ద బాధ్యత భుజాన వేసుకొన్నాడు. అది వర్కవుట్ అవ్వలేదు. ఏజెంట్ లో అయితే యాక్షన్ పీక్స్‌లో ఉంటుంది. అదీ వయసుకు మించిన పాత్రే. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ఓకే అనిపించుకోవడానికి కారణం.. అది తన వయసుకు తగిన ప్రేమకథ. అఖిల్ ఇలానే లవ్ స్టోరీలు చేసుకొంటూ వెళ్తే బాగుంటుందని, కాస్త నిలకడ సాధించాక.. మాస్, యాక్షన్ కథలు ఎంచుకొంటే మంచిదని ఆయన అభిమానులు సైతం బాహాటంగానే చెబుతుంటారు.
అయితే ‘లెనిన్’ గ్లింప్స్ చూస్తే, ఈసారి కూడా మాస్, యాక్షన్ బాట పట్టినట్టే కనిపిస్తోంది. `లెనిన్` యాక్షన్ కు పెద్ద పీట వేసిన సినిమా. గ్లింప్స్ చూస్తే అదే అర్థం అవుతోంది. దాంతో అఖిల్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే ఈ గ్లింప్ప్ లో అఖిల్ లుక్ బాగుంది. మాసీగా వుంది. రాగానూ కనిపిస్తోంది. ఇటీవల హీరోలు డీ గ్లామర్ గా కనిపించిన సినిమాలు బాగా హిట్టయ్యాయి. హీరోల ఇమేజ్ కు ఆయా చిత్రాలు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఆ ట్రెండ్ నే ఇప్పుడు అఖిల్ కూడా ఫాలో అవుతున్నాడేమో? అఖిల్ ఏం చేస్తే ఏమిటి? అయ్యగారు హిట్ బాట పట్టాలి. అదే అక్కినేని అభిమానులు కోరుకొనేది.